అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేసే మహేష్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల వల్ల తన పెళ్లి ఆగిపోయిందని.. తన జీవితం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మహేష్ అన్నను సెప్టెంబర్ 8న పోలీసులు అరెస్ట్ చేసారని.. తన అన్నయ్య అక్రమంగా కర్ణాటక మద్యం అక్రమంగా అమ్ముతున్నాడని పోలీసులు తమ ఇంటికి వచ్చి దాడులు జరిపారని తెలిపాడు. తమతో విచక్షణారహితంగా ప్రవర్తించారన్నాడు. ఈ ఘటనతో తన పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసాడు. పోలీసులే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసాడు. అయితే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story