సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నకిలీ చెక్కుల కేసు సీఐడీకి అప్పగింత

By సుభాష్  Published on  22 Sep 2020 2:37 AM GMT
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నకిలీ చెక్కుల కేసు సీఐడీకి అప్పగింత

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) నకిలీ చెక్కుల కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు నకిలీ చెక్కుల విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, ఢిల్లీలకు ప్రత్యేక బృందాలు పంపించారు. ఢిల్లీలోని శర్మ ఫోర్సింగ్‌, పశ్చిమబెంగాల్‌లోని మల్లబపూర్‌ పీపుల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, కర్ణాటకలోని అద్వైత వీకే, హోలో బ్లాక్స్‌, ఇంటర్‌ లాక్‌ సంస్థల పేరిట ఫోర్జరీ చెక్కులను గుర్తించిన సీఐడీ నకిలీ చెక్కులపై ఆరా తీస్తోంది. ఫోర్జరీ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, ఈ నకిలీ చెక్కులు జారీ చేసిన ముఠాతో పాటు దానివెనుకున్న వారిపై చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం జగన్‌. ఈ భాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని ముందుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని సీఎం ఆదేశించారు. పోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీ చేసిన ముఠా పాత్ర దారులతో పాటు వెనుకున్న సూత్రధారులను కూడా పట్టుకోవాలని అన్నారు. అయితే ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేపట్టి దోషులను పట్టుకోవాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు ఆదివారం లేఖ రాయగా, తాజాగా ఈ కేసును సీఐడీకి అప్పగిచింది ప్రభుత్వం.

కాగా, ఏపీకి చెందిన సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌మాల్‌పై ఒకేసారి న్యూఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా..? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్‌ఎఫ్‌ విభాగాల్లోని వారు ఎవరైన సహకరించారా..? అనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఈ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా ప్లాన్‌ వేసినట్లు అధికారులు చెబుతున్నారు. వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందాలు లోతుగా దర్యాప్తు చేపట్టనున్నాయి.

కాగా, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పేరిట భారీగా నగదు విత్‌డ్రా చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై గత ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లోకేసు నమోదైంది. సచివాయలం రెవెన్యూ విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ మురళీ కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. రూ.16వేలు, రూ.45 వేల చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీ చేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించినట్లు తెలుస్తోంది.

Next Story