చెదిరిపోయినట్టు ఉండే జుట్టు, చెప్పులు లేని కాళ్ళు, మురికి బట్టలు ఇవే హరి గుర్తులు. ఇంతకు హరి ఎవరు అనుకుంటున్నారా ? చెన్నైలో గతవారం జరిగిన ధ్రువ అవార్డు గ్రహీత ఈయన. అయితే ఏంటి గొప్ప అనుకుంటే పొరపాటే..అసలు విషయం తెలియాలంటే పూర్తి వార్తను చదవాల్సిందే.

హరి మధురైలో ఒక కాటికాపరి. హరికి పన్నెండేళ్ల ప్రాయంలోనే తల్లి, తండ్రి చనిపోయారు. చిన్నపిల్లవాడు, ఎలా బ్రతుకుతాడోనన్న కనీసం జాలిచూపని బంధువర్గాల వారు తరిమేశారు. తలరాత పరీక్ష పెడుతూ జీవితం తరుముతుంటే ఆకలి బాధతో ఏం చేయాలో అర్థం కాని వయసు. అప్పుడు మధురై స్మశానవాటిక ఉన్న కాటికాపరి వారు ఈయనను తమలో ఒకడిగా చేర్చుకున్నారు.

నిజాయితీగా ఏ పనిచేయడానికైనా సిద్ధపడ్డాడు హరి. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ కాటికాపర్లకు సహాయకుడిగా చేరిపోయాడు. పని దొరికింది అనేకంటే కడుపు నిండా అన్నం దొరికింది అని అనుకునే వాడు. స్మశానం ఇతనికి మంచి విషయాలు నేర్పించింది. అందులో ఒకటి దేనికి ఆశ పడకూడదు అన్న జీవిత సత్యాన్ని హరి గ్రహించాడు. అక్కడే పెరిగి పెద్దయిన హరి, ఆ స్మశానికి కాటి కాపరి అయ్యాడు.
తన అవసరాలకు మించి వచ్చే సంపాదనతో ఇతరులకు సహాయం చేస్తూ సేవ మొదలు పెట్టాడు. తనకున్న సంపాదనలోనే పేద విద్యార్థులను చదివించాడు. ప్రభుత్వ ఆసుపత్రులకు మంచాలు కొనివ్వడం, వికలాంగులకు వీల్ చైర్, గుడ్డివాళ్లకు hand sticks కొనివ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా.. చేతిలో ఇంకా కాస్త డబ్బు ఏదైనా మిగిలితే అవసరమైన వారికి సహాయం చేసేవాడు.

హరి ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల శవాలను పూడ్చడం, కాల్చడం చేశాడు. ఇందులో ఎన్నో వేల అనాద శవాలకు దహన సంస్కారాలు చేశాడు. హరి గురించి తెలుసుకున్న ధ్రువ అవార్డ్స్ పెద్దలు అతనికి ధ్రువ పురస్కారాన్ని ఇచ్చి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరి ” ఎన్నో శవాలను కాల్చి పూడ్చిన నా కోరిక ఏంటో తెలుసా..? మరణానంతరం నా భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీ కి డొనేట్ చేసి విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలి” అని విజ్ఞప్తి చేశాడు. ఇంత గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మానవత్వాన్ని వెతికితే మచ్చుకైనా దొరకని ఈ రోజుల్లో హరి గురించి తెలిసిన వారెవ్వరైనా అభినందించకుండా ఉండలేరు. ఇంతటి మహనీయుడిని ఆ సభ మొత్తం కరతాల ధ్వనులతో అభినందించేశారు.

లక్షల, వేల కోట్లు సంపాదించినవారే రూపాయి దానం చేస్తే..సంపద ఎక్కడ తరిగిపోతుందో, తమ బిడ్డల భవిష్యత్ ఏమై పోతుందో అని భయపడుతున్న ఈ రోజుల్లో హరి వంటి గొప్ప వ్యక్తి ఉండటం మానవత్వం చేసుకున్న అదృష్టం. తాను తినగా మిగిలిందేది తనకు వద్దు. మరొకరికి ఇస్తే ఏదొక రకంగా ఉపయోగపడుతుంది కదా..అని హరి లాగా అందరూ కాకపోయినా కొంతమందైనా ఆలోచిస్తే…ఎన్నో వేలమంది పేదల కడుపులు మూడు పూటలా నిండుతాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.