ఆ సమస్యను ఇప్పటికి అధిగమించలేకపోతున్నా.. ధోని
By తోట వంశీ కుమార్
ఇప్పటికీ దేశంలో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలు, బలహీనతలను అంగీకరించడం లేదని భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అన్నాడు. టీమ్ఇండియా మాజీ ఆటగాడు బద్రీనాథ్ శరవణ కుమార్ సంయుక్తంగడా ఏర్పాటు చేసిన ఎంఫోర్ స్వచ్చంద సమావేశంలో ధోని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఇప్పటికీ దేశంలో తమ మానసిక బలహీనతలను అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదని, ఎందుకంటే మనలో చాలా మంది వాటిని మానసిక ఆరోగ్య సమస్యలుగా బావిస్తాం అని ధోని అన్నాడు. ఇలాంటి విషయాలను ఎవరు బయటికి చెప్పరు. నేను బ్యాటింగ్ చేసేందుకు వెళ్లిన తరువాత 5 నుంచి 10 బంతులు ఆడే వరకు నా గుండె వేగం అమాంతరం పెరుగుతుందని చెప్పాడు. ఆ సమయంలో ఎంతో ఒత్తిడిగా అనిపిస్తుందని, కాస్త భయం కూడా వేస్తుందన్నాడు. ఇప్పటికి ఈ సమస్యను అధిగమించలేకపోతున్నానని అందరికి ఇదే అనుభూతి ఉంటుందని మహేంద్రుడు తెలిపాడు.
నిజానికి ఇది చాలా చిన్న సమస్య అని, అయినప్పటికి చాలా సార్లు కోచ్‌తో పంచుకునేందుకు మొహమాటపడతామని అన్నాడు. క్రీడల్లో ఆటగాడికి, కోచ్‌కి మధ్య అనుబంధం చాలా ముఖ్యమన్నాడు. కనీసం 15 రోజులకు ఒక్కసారైనా కోచ్ ఆటగాళ్లతో కలిసి పోవాలని అలా చేస్తే ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్‌తో చెప్పుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని వాటిని మెరుగుపరుచుకుని గొప్ప ఆటగాడిగా తయారుకావచ్చునన్నాడు. ఇక ప్రతి జట్టుకు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కోచ్ అవసరమన్నాడు.