అలా ఓడిపోయినప్పుడే రిటైర్మెంట్ అని ధోని చెప్పాడట..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 6:35 AM GMT
అలా ఓడిపోయినప్పుడే రిటైర్మెంట్ అని ధోని చెప్పాడట..!

మహేంద్ర సింగ్ ధోని.. మైదానంలో అడుగు పెట్టి చాలా రోజులే అయింది. ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా ధోనిని ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. భారత జట్టు తరపున ధోని ఆడి సంవత్సరం పైనే అయింది. ఈ మధ్య కాలంలో ధోని రిటైర్మెంట్ అంటూ పలుమార్లు కథనాలు వచ్చాయి. ఆ వదంతులన్నిటినీ ధోని భార్య సాక్షి, అతడి మేనేజర్లు కొట్టి వేస్తూ వచ్చారు.

ధోని తన రిటైర్మెంట్ గురించి ప్రముఖ కామెంట్రేటర్ సంజయ్ మంజ్రేకర్ తో చర్చించాడట.. గతంలో ధోనితో తాను మాట్లాడుతూ ఉండగా రిటైర్మెంట్ కు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లు సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. కోహ్లీ పెళ్లి సమయంలో ధోనీతో మాట్లాడుతుండగా.. ధోనీ రిటైర్మెంట్ గురించి, ఫిట్ నెస్ గురించి అడిగానని అన్నాడు సంజయ్. ధోని మాట్లాడుతూ టీమిండియాలో అందరికంటే వేగంగా పరిగెత్తే ఆటగాడిని ఓడించగలిగినంత కాలం నేను ఫిట్ గా ఉన్నట్టు భావిస్తానని.. ఒకవేళ పరిగెత్తలేకపోతే మాత్రం రిటైర్మెంట్ ప్రకటిస్తానని అన్నాడని మంజ్రేకర్ తెలిపాడు. సచిన్ టెండూల్కర్, ధోని లాంటి వాళ్లు ఛాంపియన్ క్రికెటర్లని మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో మహేంద్ర సింగ్ ధోని చివరి సారిగా ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ధోని అద్భుతంగా ఆడితే భారత జట్టు లోకి తిరిగి స్థానం సంపాదించే అవకాశం ఉందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ధోని కూడా ఐపీఎల్ కు సన్నద్ధమవుతూ ఉన్నాడు. రాంచీలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ధోని.

సెప్టెంబర్ 19 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఐపీఎల్ మొదలు కానుంది. ఐపీఎల్ మొదలైనప్పటి నుండి మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతూ వచ్చాడు. రెండు సంవత్సరాల పాటూ బ్యాన్ అయిన సమయంలో రైజింగ్ పూణే జెయింట్స్ జట్టుకు ఆడాడు ధోని. ఐపీఎల్ లో 190 మ్యాచ్ లు ఆడిన ధోని 4432 పరుగులు సాధించాడు. ధోని ఈ ఐపీఎల్ అధితంగా ఆడాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.

Next Story