బయటకొచ్చిన కాలుష్యం దాచిన అందాలు.. ఎక్కడంటే.!
By అంజి
హైదరాబాద్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు జీవన స్థితి గతులు మారిపోయాయి. రోడ్లపై వాహనాలు తిరగడం లేదు. చాలా పరిశ్రమలు మూత పడ్డాయి దీంతో శబ్ద కాలుష్య, వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడంతో వన్యప్రాణులు రోడ్లపై తిరుగుతున్నాయి. గాలిలో చాలా స్వచ్ఛత పెరిగింది. మారిన వాతావరణానికి సంబంధించిన కొన్ని రుజువులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో కాలుష్యం భారీగా తగ్గడంతో అక్కడ ఓ అరుదైన దృశ్యం ప్రజలను ఆకట్టుకుంటోంది. జలంధర్ నగరంలోని ప్రజలకు ధౌలాధర్ మంచు కొండలు కనిపిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధౌలాధర్ మంచు కొండల శ్రేణిని చూస్తూ ప్రజలు పకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇప్పటవరకు జలంధర్ నగరంలో ఎప్పుడూ కూడా ఈ మంచుకొండలు కనిపించలేదు. ఇప్పుడు గాలిలో స్వచ్ఛత పెరగడంతో ఆ దృశ్యాన్ని చూసి నగర వాసులు సంబరపడుతున్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ఈ అపూరూప దృశ్యాన్ని శుక్రవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. 'కాలుష్యం లేనందున జలంధర్ ప్రజలు మొదటిసారిగా ధౌలాధర్ కొండలను చూశారు. జలంధర్‌కు 213 కిలోమీటర్ల దూరంలో ఈ మంచుకొండలు ఉన్నాయి. చూడండి.. కాలుష్యం మనల్ని ఎలా గుడ్డివారిని చేసిందో' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ట్విటర్‌లో చాలా మంది లైక్‌లు, కామెంట్లు, రీట్వీట్‌లు చేశారు. ఓ నెటిజన్ తన కామెంట్‌లో.. నేను జలంధర్‌లో నివసిస్తున్నాను. మంచు కొండల దృశ్యం చాలా అందంగా ఉంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మొదటిసారి ఇక్కడ చూశాను. ఇది చూసి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అని రాశాడు.
క్రికెటర్ హర్బజన్ సింగ్ కూడా తన ఇంటి మేడ మీద నుంచి తీసిన ధౌలధర్ మంచుకొండల ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశాడు.