హాస్టళ్లు మూసేస్తే కఠిన చర్యలు - డీజీపీ
By రాణి Published on 26 March 2020 12:23 PM IST
ముఖ్యాంశాలు
- ఎన్ఓసీ చెల్లదు
- ఆంధ్రా సరిహద్దుల్లో విద్యార్థుల పడిగాపులు
- ఇలాగే చచ్చిపోమంటారా అని ఆవేదన చెందుతున్న విద్యార్థులు
తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లోని హాస్టళ్లన్నింటినీ దాదాపు మూసివేశారు. దీంతో వేలమంది విద్యార్థులు దిక్కులేక సొంతఊర్లు వెళ్లేందుకు ఎన్ఓసీ (No Objection Certificate) ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. విద్యార్థుల కష్టాలు చూడలేక పోలీసులు కూడా అర్హులైన వారికి ఎన్ఓసీలు ఇచ్చారు. ఇలా ఎన్ఓసీలు తీసుకున్నవారిలో 5 శాతం మంది మాత్రమే ఇళ్లకు చేరారు. మిగతా వారంతా వెనుదిరిగారు. ఎందుకంటే ఆంధ్రాలోకి రావాలంటే 14 రోజులు క్వారంటైన్ ఉండాలని ఏపీ, తెలంగాణ బోర్డర్ లో ఉన్న పోలీసులు ఆంక్షలు పెట్టారు. అలా క్వారంటైన్ లో ఉండేకన్నా హాస్టల్ లో ఉండటం మేలనుకున్నారో ఏమో గానీ..వెళ్లినవారు వెళ్లినట్లే వెనుదిరుగుతున్నారు. కొంతమంది విద్యార్థులైతే ఏకంగా నడుచుకుంటూనే సొంతఊర్లకు వెళ్లేందుకు పయనమయ్యారు.
Also Read : హైదరాబాద్ లో ఫ్రీ భోజనం..
తాజాగా..ఎన్ఓసీ, హాస్టళ్ల మూసివేతపై డీజీపీ మహేందర్ స్పందించారు. లాక్ డౌన్ ఉన్న కారణంగా ఎవరూ నగరం దాటి వెళ్లేందుకు వీల్లేదని తెగేసి చెప్పేశారు. పోలీసులిచ్చిన ఎన్ఓసీలు పనిచేయవని పేర్కొన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హాస్టళ్ల యజమానులతో మాట్లాడాలని సూచించారు. హాస్టళ్లు మూసివేసి విద్యార్థులను, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. తిరిగి హాస్టళ్లు తెరిచి హాస్టల్ లో ఉన్నవారందరికీ మూడుపూటలా ఆహారాన్ని అందించాలన్నారు. హాస్టళ్లలో వంటల కోసం కూరగాయలు, ఇతర నిత్యావసరాలను జీహెచ్ఎంసీ అందిస్తుందన్నారు. హాస్టళ్ల మూసివేతపై మంత్రి తలసాని కూడా హాస్టళ్ల యజమానులతో మాట్లాడనున్నారు.
Also Read : మానవత్వం మంటగలిసిన వేళ..నడిరోడ్డుపైనే మృతి
మరోవైపు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను సంప్రదించారు. హైదరాబాద్ లో ముఖ్యంగా అమీర్ పేట్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, కోఠి, కూకట్ పల్లి ప్రాంతాల్లో హాస్టళ్ల మూసివేతతో వేలమంది విద్యార్థులు ఆంధ్రా సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్నారని తెలిపారు. హాస్టళ్లను తిరిగి తెరిపించి విద్యార్థులను ఆదుకోవాలని బొత్స కోరారు. కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఎవరూ ఎక్కడికీ కదలడం మంచిదికాదన్నారు. అలాగే ఇదే విషయమై ఏపీ సీఎస్ నీలం సాహ్ని కూడా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తో మాట్లాడారు. దీంతో తెలంగాణలో హాస్టళ్లను మూసివేయించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.