గోదా గోవింద గీతం: యమున దాటి వ్రేపల్లెలో యశోద పట్టియైనట్టి

Yashoda Pattiainatti in Vrepalle across the Yamuna. ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్

By M Sridhar  Published on  9 Jan 2023 1:45 AM GMT
గోదా గోవింద గీతం: యమున దాటి వ్రేపల్లెలో యశోద పట్టియైనట్టి

ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్

ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర

తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద

కరుత్తై పిరైప్పిత్తు కంజన్ వైత్తిల్

నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై

అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్

తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి

వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

అర్ధరాత్రి ఓతల్లి కడుపు పంటయైపుట్టి వెంటనే

యమున దాటి వ్రేపల్లెలో యశోద పట్టియైనట్టి

నిన్నోర్వలేక పరిమార్చు కుట్రల దునుమి నావు

కంసుని గుండెలో ద్వేషమనెడు నిప్పు పెట్టి నావు

మాధవుని వేడి పరము కోరెడు మా ప్రేమల కన్న

కన్నయ్య వ్యామోహమే మిన్నయని తెలిసినాము

పిరాట్టియైన కోరని సిరిని కోరి, నీ శౌర్యసౌశీల్యముల

కీర్తించి నీ విరహదుఃఖము మాన్పగా వచ్చినాము.

శ్రీరాముడు యువకుడిగా ఎదిగిన తరువాత రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని శ్రీ కృష్ణుడి పుట్టుకే శత్రుస్థావరంలో జైల్లో జరిగింది. ..ఎంతో కాలం గడిచిపోయినా శ్రీ కృష్ణ ఆవిర్భావ సమయంలో ఉన్న పరిస్థితులు అప్పుడే ఉన్నట్టు భావించి గోపికలు ఆందోళన పడుతున్నారు.

అర్థం

ఒక తల్లికి (ఒరుత్తి) మగనాయ్ (పుత్రుడిగా) జనించి (పిఱందు) పుట్టిన రాత్రే మరొక తల్లికి (ఒరుత్తి) కొడుకుగా (మగనాయ్) రహస్యంగా పెరుగుతున్న కాలంలో (ఒళిత్తువళర) ఒక రాక్షసుడు (త్తాన్) సహించని వాడై (తరిక్కిలానాగి) కీడు తలపెట్టి (తీంగు నినైంద) కంసుని యొక్క (కంజన్) దురాలోచనను (కరుత్తై) భగ్నం చేసి (పిరైప్పిత్తు) ఆతని కడుపులో (వయిట్రిల్) నిప్పై నిలిచిన (నెరుప్పు నిన్ఱ) సర్వాధికుడా (నెడుమాలే) నిన్ను (ఉన్నై) కావలసిన వాటిని అడగడానికి వచ్చినాము (అరుత్తిత్తువందోమ్) మాకోరికను తీర్చేట్లయితే (పఱై తరుదియాగిల్) శ్రీమహాలక్ష్మి కూడా కోరదగిన నీ ఐశ్వర్యాన్ని (తిరుత్తక్క శెల్వముమ్) నీ శౌర్యసౌశీల్య లక్షణాలను (సేవగముమ్) మేము పాడి, స్తుతించి (యామ్ పాడి) నిన్ను ఎడబాసిన దుఃఖము తొలగిపోగా (వరుత్తముమ్ తీర్ న్దు) సంతోషిస్తాము (మగిఝిన్దు).

-- మాడభూషి శ్రీధర్

Next Story