గోదా గోవింద గీతం :పుంసాం మోహనరూపుని మిగుల కీర్తించి నిలిచినాము
We have glorified the glory of Punsam Mohanarupa.పుంసాం మోహనరూపుని మిగుల కీర్తించి నిలిచినాము.
By M Sridhar Published on 27 Dec 2022 7:34 AM IST
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
భావార్థ గీతిక
దూడల తలచి చేపునకు వచ్చి ఎనుములు పాలు స్రవించ
కుండలన్నియునిండి, పొంగి పొరలి సంపదలు వరదలెత్తు
సొంతపనులు వదిలి కృష్ణుసేవించు భాగ్యశాలి సోదరివీవు
మంచుకురియు సమయాన నీ గుమ్మాల వేలాడుతున్నాము
సతిని విడదీసిన దుష్టు దశకంఠు దునిమాడిన దాశరథి
పుంసాం మోహనరూపుని మిగుల కీర్తించి నిలిచినాము
వ్రేపల్లె వాడవాడలందు నీ నిదుర కీర్తి నిండార వ్యాపించె
ఇకనైన కలసి భజింతము రావమ్మ సిరినోము నోచవమ్మ
భగవత్ సేవా సంపద అధికంగా కలిగిన గోపికను తీసుకుని వెళితే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడని గోదమ్మ తల్లి భావించారు
అర్థం : కనైత్తు= (పాలుపితికే వారు లేకపోవడం వల్ల) అరచి, ఇళం కన్ఱు ఎరుమై=లేగదూడలనుగల ఎనుములు, కన్ఱుక్కు ఇఱంగి= లేగలపైజాలిగొని, నినైత్తు = దూడ తనపొదుగులో మూతిపెట్టినట్టు తలచి, పాల్ శోర= పాలుకార్చుచుండగా, ఇల్లమ్ ననైత్తు= ఇల్లంతా తడిసి, శేఱు ఆక్కుమ్ = బురదఅవుతున్నట్టున్న, నర్ చెల్వన్= శ్రీకృష్ణకైంకర్యముచేత గొప్ప ఐశ్వర్యముకలిగిన వ్యక్తియొక్క, తంగాయ్=చెల్లెలా, తలైపనివీఝ= మాతలలపై మంచు పడుతుండగా, నిన్ వాశల్ కడైపట్రి = నీ ఇంటి గుమ్మాన్ని పట్టుకుని, తెన్ ఇలంగైకోమానై= సిరిసంపదలతో విరాజిల్లే లంకకు రాజైన రావణాసురుని, శినత్తినాల్ చ్చెట్ర= శ్రీదేవినుంచి ఎడబాటుచేసినాడన్న కోపంతో చంపిన, మనత్తుక్కు ఇనియాయై= మనసుకు హాయికలగించే (మనోహరుడైన) శ్రీరామచంద్రుని, ప్పాడవుమ్= మేము స్తుతించినప్పడికీ, నీవాయ్ తిఱవాయ్=నీనోరు తెరిచి మాట్లాడడం లేదే, ఇనిత్తాన్= ఇకనైనా, ఎఝుందిరాయ్= మేలుకో, ఈదు ఎన్న పేరురక్కమ్ = ఇదేమి పెద్ద నిద్ర, అనైత్తు ఇల్లత్తారుమ్= గోకులంలి ఇళ్లలో ఉన్నవారందరికీ, అఱిందు = నీ గాఢనిద్రగురించి తెలిసిపోయింది.
- మాడభూషి శ్రీధర్