గోదా గోవింద గీతం : 'కులుకుపలుకుల చిన్నారి చిలుక నీకింక కునుకేల'
Kulukupalukula is a small parrot.ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
By M Sridhar Published on 30 Dec 2022 2:12 AM GMTఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
భావార్థ గీతిక
'కులుకుపలుకుల చిన్నారి చిలుక నీకింక కునుకేల'
'చెవులుజల్లన అరవకే, నేనిపుడె వచ్చెదనులేవే'
'కలికి నెరజాణ నీ మాట తెలివి మాకు తెలుసులేవే'
'మీకన్నజాణలు వేరెవ్వరే, పోనీ మీరే పరిపూర్ణులేలే'
'తెమిలి ఇకనైన రమ్ము', 'మరి చెలులెల్ల వచ్చినారొ?'
'అనుమానమేల సఖీ నీవె వచ్చి లెక్కించుకోవచ్చులే'
కువలయాపీడమ్ముగూల్చి కంసాది రాక్షసుల కడతేర్చిన
బాలకృష్ణుడి భక్తి సేవించ రారమ్మ గొల్ల భామలారా
పదిమంది ఆళ్వార్ లను, పదిమంది గోపికలను మేలుకొలుపే కార్యక్రమం పూర్తయింది. ఈ పాశురంలో తిరుమంగయాళ్వార్ ను నిద్రలేపి మంత్రం శ్రీమతే శఠగోపాయనమః
అర్థం : బయటవేచి ఉన్న గోపికలకు లోన ఉన్నటువంటిగోపికలకు మధ్య సంభాషణతో కొనసాగుతుందీ పాశురం. మాయనై లీలామానుష విగ్రహుడై శ్రీకృష్ణుడిని కీర్తించడానికి కదలి రమ్మని బయట ఉన్న గోపబాలికలు పిలుస్తున్నారు.
సహనం తోసాధన చేస్తే నే ఏదైనా సాధ్యం. భాగవత సహవాసం వల్ల సహనం వస్తుంది. ఆచార్యకటాక్షం లభిస్తుంది. ఆచార్యుని దయ కలగడానికి ముందు ఏం చేయాలో వివరించే పాశురం ఇదిలోపల ఉన్న గోపికను వాకిలి బయటనుంచి పిలుస్తున్నారు అక్కడ చేరిన గోపికలు. నిన్న తమతో చేరిన గోపబాలికతో కలిసి పంకజనేత్రుని పుండరీకాక్షుని వర్ణిస్తూ ఉంటే విన్న లోని గోపిక తాను బయటకు వస్తే ఈ శ్రీకృష్ణ గానామృతాన్ని ఆపుతారేమోనని లోపలనుంచే తానూ గొంతు కలుపుతుందట. అది విని, మేలుకొని ఉన్నా బయటకు రాలేదని వీరు కోపిస్తారు.
బయటగోపికలు: "ఎల్లే!" ఏమే, "ఇళంకిళియే!" తీయనిమాటల లేత చిలకా! "ఇన్నంఉఱంగుదియో" అందరూ వచ్చిన తరువాత కూడా ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా? (చిలకవంటి గొంతుగల ఆ గోపిక తమ వెంట ఉంటే శ్రీ కృష్ణుడు సులభంగా లభిస్తాడని వీరి ఆశ, కనుక పరోక్షంగా పొగుడుతున్నారు)
లోపలి గోప బాలిక: చెవులు జిల్లుమనేట్టు పిలవవద్దు. మీ అందరినీఎడబాసి బాధతో నేనుంటే మీరు నన్ను పొగడటం సరికాదు (శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నారేమో అని అనుమానించి) "శిల్ ఎన్ఱు అరైయేన్మిన్" ఏమిటీ అల్లరి శ్రీకృష్ణుడు నా దగ్గరేమీ లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" నేనే వస్తున్నాను లెండి.
బయటిగోపిక:"వల్లై"మహాసమర్దురాలివే, మంచి నేర్పరివే, "ఉన్ కట్టురైగళ్" "పండేయున్ వాయఱిదుమ్" కటువైన మాటలు, నేర్పు మాకు ఎప్పటినుంచో తెలుసులే.
లోపల గోప బాలిక: "వల్లీర్గళ్ నీంగళే" నేనేం కాదు మీరే సమర్థులు, నన్నా సమర్థురాలని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటువల్ల బాధలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు. పోనీ నేనే కఠినరాలిననుకోండి.
బయటి వారు: "ఒల్లై నీ పోదాయ్" సరే అలా అయితే రా మరి, "ఉనక్కెన్న వేఱుడైయై" నీకే ప్రత్యేకత ఉంది?
లోపల గోపబాలిక: "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా
బయటి గోపబాలిక: "పోందార్" అందరూ వచ్చారు, కావాలంటే నీవు బయటికి వచ్చి లెక్కించుకో నీ దర్శనం మాకు కావాలి.
లోపల గోప బాలిక: "పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం
బయటివారు: "వల్లానై కొన్ఱానై " బలీయమైన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని, "ప్పాడ" పాడుదాం.
- మాడభూషి శ్రీధర్