గోదా గోవింద గీతం : మేము వచ్చిన పనిజూచి మమ్ము కరుణించవయ్య

Krishna walked to the throne like a lion.మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్

By M Sridhar  Published on  7 Jan 2023 2:15 AM GMT
గోదా గోవింద గీతం : మేము వచ్చిన పనిజూచి మమ్ము కరుణించవయ్య

మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్

శీరియ శిఙ్గం అణివిట్రు త్తీ విళిత్తు

వేరిమయిర్ పొఙ్గ ఎప్పాడుమ్ పేర్ న్దుదఱి

మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు

పోదరుమాపోలే, నీ పూవై ప్పూవణ్ణా ! ఉన్

కోయిల్ నిన్రిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ

శీరియ శిఙ్గాసనత్తిరున్దు యామ్ వన్ద

కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్


భావార్థ గీతిక

వానకారు కొండగుహల లోలోన సింహిక కౌగలించి

హాయిగ శయనించు కొదమ సింగము లేచి ఠీవిగా

నిప్పురవ్వలు కురిపించు కంటికొసచూపులు విసిరి

పరిమళపు జూలు నిక్కబొడిచి విదిలించి ఒడలు విరిచి

గంభీరరావమున గాండ్రుమని గర్జించి నలుదిశలజూచి

గుహనుంచి వెలువడి కానుగపూరంగు వళ్లు సాచి

శయనపీఠము నుంచి చతురగతి సింహాసనమునెక్కి

మేము వచ్చిన పనిజూచి మమ్ము కరుణించవయ్య

గోపికలు శ్రీ కృష్ణుడు గంభీరంగా కదలివస్తుంటే చూడాలనే ప్రగాఢ వాంఛతో సింహాసనం వైపు కదలి రమ్మని కోరుకున్నారు

అర్థం: వర్షాకాలంలో (మారి) కొండగుహలో (మలైముఝంగిల్) ఆడసింహాన్ని కౌగిలించుకుని పడుకొని ఉన్న (మన్నికిడందు) నిదురిస్తున్న (ఉఱంగుమ్) శౌర్యోపేతమైన సింహం (శీరియ శింగమ్) మేలుకుని లేచి (అఱివిట్రు) నిప్పులు కురుస్తూన్నకనులు తెరిచి (తీవిఝుత్తు) పరిమళించే జూలును (వేరిమయిర్) నిక్కబొడిచి (నిగిడ్చి) (పొంగ) అన్నిదిశలలో( ఎప్పాడుమ్) కదలి (పేర్ న్దు) ఒడలు విరచి (ఉదఱి) శరీరాన్ని సాగదీసి (మూరి నిమిర్ న్దు) గర్జించి (ముఝంగి) వెలుపలకు (పురప్పట్టు)వస్తున్నట్టుగా (పోదరుమాపోలే) కానుగ పూవు వంటి మేను ఛాయగలవాడా (నీ పూవైప్పూవణ్ణా) నీ నివాసభవనం నుంచి (ఉన్ కోయిల్ నిన్ఱు) ఇక్కడికి వేంచేసి (ఇంగనే పోందరుళి) మనోహరమైన (కోప్పుడైయ) శ్రేష్ఠమైన (శీరియ) సింహానంపైన ఆసీనుడవై (శింగాసనత్తిరిందు) మేము వచ్చిన (యామ్ వంద) పనిని (కారియమ్) పరిశీలించి అనుగ్రహించు (ఆరాయ్ న్దు అరుళు).

Next Story
Share it