గోదా గోవింద గీతం : గోమందల పాలక గోవింద నిదుర లేవవయ్య

Govinda Nidura Levayya.ఏట్రకలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప

By M Sridhar  Published on  5 Jan 2023 7:23 AM IST
గోదా గోవింద గీతం : గోమందల పాలక గోవింద నిదుర లేవవయ్య

ఏట్రకలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప

మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్

ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్

ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్

తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్

మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్

ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే

పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్


భావార్థ గీతిక

ఘటములెల్ల నిండి పొంగి పొరలెడు పాలనిచ్చు

గోమందల పాలక గోవింద నిదుర లేవవయ్య

నినుదెలియ వేదమేదారి, వేదమైన నినుదెలుపలేదు

సహస్ర సూర్యకిరణ సహస్రాక్ష సహస్రపాదుడీవు

సకలచేతనా చక్షువుల ప్రత్యక్ష తేజో రూపమీవు

బలముడిగి శత్రువులు నీ చరణాలు ఆశ్రయించి

నీయింటి వాకిట అన్యథా గతిలేక శరణు వేడుచున్నారు

నీకు మంగళము పాడ మేము కూడ జేరి నిలిచినాము.

భగవంతుడితో కలిసి మన మాటలు వింటుంది. శృణాతి శృణోతి. పురుషకార భూతురాలు. శ్రీవైష్ణవంలో ఉన్న విశేషం అదే. తల్లి మనతోనూ ఉంటుంది. మనం ఆరాధించి ఆశ్రయించే దేవతా అవుతుంది.

అర్థం: పాల కుండలు (ఏట్రకలంగళ్) నిండి పైకి పొంగి పొరలి పోయే (ఎదిర్ పొంగి మీదళిప్ప) విధంగా ఎడతెగకుండా పాలు స్రవిస్తున్న (పాల్ శోరియుమ్) ఉదారమైన (వళ్లన్) భారీ ఆవులను (పెరుంబశుక్కళ్) విశేషంగా కలిగిన నందగోప కుమారా కృష్ణా (ఆట్రపడైత్తాన్ మగనే) మేలుకో (అఱిఉఱాయ్), వేదం తెలిపిన (ఊట్రముడైయాయ్) మహాబలశాలీ, వేదం వలన కూడా తెలుసుకోవడం సాధ్యం కాని (పెరియార్) మహామహిమాన్వితుడా, ప్రపంచంలో (ఉలగినిల్) సకల చేతనా చక్షువులకు ప్రత్యక్షంగా నిలిచిన (తోట్రం ఆయన్ నిన్ణ) తేజో రూపా (చుడరే), నిద్రమేలుకో (తుయలెజాయ్) , నీకు శత్రువులు (మాట్రార్) నీ ముందు బలాన్ని కోల్పోయి (ఉనక్కు వలితొలైందు) నీ ఇంటి వాకిట (ఉన్ వాశల్ కళ్) గతిలేక నిలిచి (ఆట్రాదువందు) నీ పాదాలను (ఉన్ అడి) స్తుతించినట్లు (పణియు మాపోలే) మేము (యామ్) నిన్ను స్తుతించి (పుగజున్దు) నీకు మంగళాశాసనం (పోట్రి) చేయడానికి వచ్చినాము (వందోమ్).భారత సంస్కృతిలో ఆనాటి కాలంలో ఆర్థిక వ్యవస్థ పశువులు పాల చుట్టూ తిరిగేది. పాడిపంటలు పొంగిపొర్లితే సంపదే సంపద. పాడిపంటలే అసలు సంపద. ఉత్తరాంధ్రలో పశువులను ఇప్పడికీ సొమ్ములు అంటారు. నందగ్రామంలో పాడిపశువులు చల్లని శ్రీకృష్ణ కరస్పర్శతో పెరిగినాయి. తన వారికోసం ఎన్నో ఉపకారాలు చేస్తూ ఇంకా ఏదైనా చేయాలేమో అనుకుంటూ ఉండే శ్రీకృష్ణుని ఉదార భావం (వళ్లల్) ఆయన చల్లని చేతులు తాకిన ఆ ఆవులకు కూడా వచ్చింది. తనను పెంచుకుంటూ పోషిస్తున్న యజమానులకు ఎన్ని పాలైనా ఇవ్వాలని ఆవులు అనుకుంటూ కుండలు (ఏట్రకలంగళ్) నిండి పొంగి పొర్లినా (ఎదిర్ పొంగి మీదు అళిప్ప) పాలు స్రవింపచేస్తూనే (పాల్ శొరియమ్) ఉన్నాయట. శ్రీ కృష్ణుడు తన కరుణామృత క్షీరధారలను కూడా అదేవిధంగా కురిపిస్తాడు. ఉదారత్వం రావడమే కాకుండా తాను తాకడం వల్ల పాడి పశువులు మరింత బలిష్ఠమైనాయట.

- మాడభూషి శ్రీధర్

Next Story