గోదా గోవింద గీతమ్: అనుగ్రహించిన అమ్మ నీలాదేవి

Goda Govinda Geetam: Amma Neela Devi who blessed. అమ్మవారిని ఆశ్రయించకుండా ఆశ్రయించే దశ పూర్తికాదు. అమ్మగారు పురుషకారం.

By M Sridhar  Published on  2 Jan 2023 1:32 AM GMT
గోదా గోవింద గీతమ్: అనుగ్రహించిన అమ్మ నీలాదేవి

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్

నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!

కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్

ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి

ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్

పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ

శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప

వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

భావార్థ గీతిక

మదపుటేనుగులు వేయి నదుపు జేసెడివారు

వైరుల దరిమెడు అతిరథుడు అరిభంజనుడు

నందగోపుని మేనగోడల నప్పిన్న పరిమళ నీలవేణి

కొక్కొరకోల ప్రభాతగీతమ్ము నీ చెవులు సోకలేదేమొ

మాధవీలతల చిగురుమేసిన కోకిల గానాలు వినలేదేమొ

గోవిందునెదపై నీళ హస్తమొకటి, క్రీడించు బంతి మరొక చేత

కాలిఅందెల ఘల్లు ధ్వనుల స్వర్ణకంకణ కాంతులెగయ

కంజదళాక్షి కదిలి రావమ్మ కవాటపు గడియతీయ.

అమ్మవారిని ఆశ్రయించకుండా ఆశ్రయించే దశ పూర్తికాదు. అమ్మగారు పురుషకారం. మధ్యవర్తి. జీవుల పక్షాన నిలబడి, వారికోసం భర్తకు సిఫారసు చేసే దయామయి.

అర్థం

"ఉందు మదకళిత్తన్" =మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు "ఓడాద తోళ్ వలియన్" ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అంతటి "నంద గోపాలన్" నందగోపాలుని "మరుమగళే!" కోడలా, నప్పిన్నాయ్ = సమగ్ర సౌందర్య రాశీ, నీలాదేవీ అంటూ పిలిచారు. సీతా దేవి దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు గోపికలు. "కందం కమరుం కురలి" =సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! (మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ)."కడై తిఱవాయ్" గడియ తెరువుమా."కోరి అరైత్తన కాణ్" = కోడి కూస్తుంది, కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. దమ్మా"ఎంగుం" =అన్నీ కోళ్ళు కూస్తున్నాయి "వంద్" = తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అటువంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అని గోదమ్మ వివరిస్తున్నారు.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. "మాదవి ప్పందల్ మేల్" = మాధవీలత ప్రాకిన పందిరి మీద "పల్గాల్" అనేక సార్లు "కుయిల్ ఇనంగళ్" =కోకిలల గుంపులు "కూవిన కాణ్" = కూస్తున్నాయి. రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, "పందార్ విరలి" = బంతి చేతులలో కలదానా. ఈ భూమి వంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అటువంటి అండాలనన్నీ కలిపితే అది బ్రహ్మాడం. అటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు, ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

"ఉన్ మ్మైత్తునన్ పేర్ పాడ" నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. "శెందామరై క్కైయాల్" నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో "శీరార్ వళై ఒలిప్ప" నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, "మగిరింద్" అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో "వందు తిఱవాయ్" నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ నిద్ర లేపింది అని జీయర్ స్వామి వివరించారు.

- మాడభూషి శ్రీధర్

Next Story