పోలవరంపై మంత్రి పత్తా లేడు..సీఎం నోరు విప్పరు : దేవినేని ఉమా

By Newsmeter.Network  Published on  21 Nov 2019 8:45 AM GMT
పోలవరంపై మంత్రి పత్తా లేడు..సీఎం నోరు విప్పరు : దేవినేని ఉమా

ముఖ్యాంశాలు

  • మంత్రులు, ఎమ్మెల్యేలపై దేవినేని ఉమా ఫైర్
  • మాలధారణలో ఉండి కూడా నీచమైన భాష మాట్లాడుతున్నారు
  • సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై ధరలు పెంచారు
  • ముఖం నచ్చకపోయినా, మాముళ్లు ఇవ్వకపోయినా నో కాంట్రాక్ట్
  • 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా సీఎం అభద్రతాభావనలో ఉన్నారు

అమరావతి: ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మత విశ్వాసాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. మాలధారణలో ఉండి కూడా నీచమైన భాష మాట్లాడుతున్నారన్నారు.ఇలా నోరు వేసుకుని పడితే మీ అపాయింట్‌మెంట్‌లు దొరుకుతాయా అని సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు ఉమా. సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై ధరలు పెంచేసింది‌ వాస్తవం కాదా అని క్వశ్చన్ చేశారు. మద్యం బార్లు, కంపెనీలతో కూడా చీకటి ఒప్పందాలు‌ చేసుకున్నారని ఉమా ఆరోపించారు. వీటిని ప్రశ్నిస్తే తనపై ఎదురు దాడి చేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విషయంలో 68 మంది పై ఫిర్యాదులు వస్తే.. వారి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు ఉమా.

పోలవరం విషయంలో మంత్రి పత్తా లేడు. సీఎం నోరు విప్పడని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. గిన్నీస్ రికార్డ్ ఎక్కిన కంపెనీలను కూడా పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. ముఖం నచ్చకపోయినా...అడిగిన మామూళ్లు ఇవ్వకపోయినా కాంట్రాక్టు రద్దు చేస్తున్నారని ఆరోపించారు.తప్పు లను ప్రశ్నిస్తే అయ్యప్ప మాల‌ వేసుకున్న వారితో తిట్టిస్తున్నారని చెప్పారు ఉమా.151 ఎమ్మెల్యే లు ఉన్నా.. సిఎం అభద్రతా భావంతో బతుకుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు. తిరుమల పై కొడాలి నాని వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించ లేదన్నారు. అన్యమత ప్రచారం ఆపాల్సిన బాధ్యత టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి లేదా అని ఉమా ప్రశ్నించారు.తిరుమల వంటి పవిత్ర ప్రదేశాన్ని పంచాయితీలకు అడ్డాగా మార్చారంటూ మండిపడ్డారు .

మైలవరం నియోజకవర్గం లో నోట్లను చించి, స్లిప్పులు ఇచ్చింది వైఎస్ఆర్‌ సీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కరెన్సీ నోట్ల ను చించి పంచే అధికారం ఎవరిచ్చారన్నారు. ఈ‌ విషయం సోషల్ మీడియాలో కూడా వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ఉమా ఆరోపించారు. సిఎం, పోలీసులు స్పందించి బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్ చేశారు.

Next Story
Share it