'ఏపీ తుగ్లక్' ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు : దేవినేని
By రాణి
అమరావతి : భారత ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర మంత్రులతో శంకుస్థాపన గావించబడిన రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉందని దేవినేని ఉమా ఆరోపించారు. శాసనసభలో రాజధాని పై చేసిన ప్రకటనతో ఏపీ తుగ్లక్ ఏమి చేస్తున్నాడో ఎవరికి అర్ధం కావటం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో అమరావతిలో రాజధాని నిర్మాణానికి మనస్ఫూర్తిగా స్వాగతించిన జగన్.. మాట తప్పను, మడమ తిప్పను అని మాట తప్పాడని విమర్శించారు. ఒక వైపు చూస్తే మంత్రి
పేర్నినాని ఏమో రాజధాని ఉండొచ్చు ఉండకపోవచ్చని, మరో మంత్రి కొడాలి నాని ఏమో సీఎం చెప్పింది ఫైనల్ అవుతుందా అని, ఇంకొక మంత్రి పెద్దిరెడ్డి 3 కాకపోతే 30 చోట్ల రాజధాని పెడతాం..రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం అని ఇష్టానుసారం ప్రకటనలు చేస్తున్నారుని మండిపడ్డారు.
మూడు రాజధానుల విషయంలో సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా చెప్పిన జగన్ ఆ దేశ ప్రధాని పార్లమెంటులో చెప్పిన మాటలు విన్నారా ? అని దేవినేని ప్రశ్నించారు.
సీబీఐ విచారణ జరిపించాలి
జగన్మోహన్ రెడ్డి సూచనతో విజయసాయిరెడ్డి సారథ్యంలో భోగాపురం, మధురవాడలలో 6 వేల ఎకరాలు భూములు వైసీపీ నేతలు కొన్నారని, గత మూడు నెలల్లో సీబీఐ విచారణ చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. అప్పుడే అసలైన ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందని అన్నారు.
విశాఖలో గత మూడు నెలల్లో జరిగిన భూ లావా దేవీలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ...అమరావతి వికేంద్రీకరణ చేసి అమరావతిని చంపేయాలి అని జగన్ వ్యూహాలు రచిస్తున్నాడని దుయ్యబట్టారు. ఇంకా 10 శాతం నిధులు ఖర్చు చేస్తే అమరావతిలో భవనాలు పూర్తి అయిపోతాయని దేవినేని చెప్పారు. జగన్ దేశ సార్వభౌమాధికారం ప్రదర్శిస్తున్నాడని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.