ఈఎస్ఐ స్కాంలో డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 7:01 AM GMT
ఈఎస్ఐ స్కాంలో డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్

ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబి అధికారులు.. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆమె కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమచారం. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఫార్మసిస్ట్‌ రాధిక, ఈఎస్‌ఐ ఉద్యోగి నాగరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ హర్షవర్థన్‌, ఎండీ శ్రీహరిని అరెస్ట్‌ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) విభాగంలో జరిగిన అవినీతి బట్టబయలయింది. ఏసీబీ దాడులలో దాదాపు రూ.12 కోట్ల నకిల బిల్లులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు సంపాదించారు.

ఐఎంఎస్ విభాగంలో మందుల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయనీ, కోట్ల రూపాయలు మ‌ళ్లించ‌బ‌డ్డాయ‌ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఈఎస్ఐ సరఫరా చేసే మందులపై ఆ సంస్థ ముద్ర ఉంటుంది. అయితే, ఈ ముద్ర లేకుండా మందులను కొనుగోలు చేసి, వాటిని అధికారులు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు.

ఐఎమ్‌ఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డా. కె. పద్మ 2018 మే 26, 28వ తేదీల్లో రూ.1.03 కోట్ల నకిలీ బిల్లులను రూపొందించారు. వీటిని పటాన్‌చెరు, బోరబండ ఇన్‌ఛార్జి మెడికల్‌ ఆఫీసర్ల సాయంతో క్లెయిమ్‌ చేశారు. అదే నెలలో బొంతపల్లి, బొల్లారం డిస్పెన్సరీలకు రూ.1.22 కోట్ల నకిలీ బిల్లులు తయారు చేసి మందులను మాత్రం పంపకుండా డబ్బులు జేబులో వేసుకున్నారు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఇందిరతో కలిసి డైరెక్టర్ దేవికా రాణి రూ.9.43 కోట్లను బిల్లుల పేరిట 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్వాహా చేశారు. మొత్తంగా మందుల కోనుగోళ్ల పేరిట రూ.11.69 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో సిబ్బందితో పాటు పలువురు ప్రైవేటు మెడీకల్ ఏజెన్సీల ఉద్యోగులు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ విచారణలో ఇంకా ఎన్ని విష‌యాలు బయటపడతాయో వేచి చూడాలి మ‌రి.

Next Story