ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రంగంలోకి దిగారు. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫీస్‌లో ఢిల్లీలోని తాజా పరిస్థితులపై సమీక్షించారు. ఆందోళనకారుల వివరాలను పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మౌజ్‌పైర్‌, జఫరాబాద్‌, గోకుల్‌పురి, భజన్‌పూర్‌ ప్రాంతాల్లో దోవల్‌ తిరిగి.. అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. రాళ్ల దాడిలో 200 మందికిపైగా గాయాలు అయ్యాయి. నిరసనకారులు షాపులను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మౌజ్‌పూర్‌, జాఫరాబాద్‌, కర్నాల్‌నగర్‌, చాంద్‌బాగ్‌లో సీఏఏ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు.

కాగా ఢిల్లీలో చెలరేగుతున్న హింసపై కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈశాన్య ఢిల్లీలో ఇవాళ పాఠశాలలకు మనీష్‌ సిసోడియా సెలవు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన 10, 12 తరగతుల పరీక్షలను తూర్పు, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాయిదా వేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.