ఆ జైల్లో తలారీ లేడు.. నెలరోజుల్లోనేమో నిర్భయ నిందితులకు ఉరిశిక్ష.. అసలేం జరుగుతోంది..!

By Newsmeter.Network  Published on  3 Dec 2019 10:57 AM GMT
ఆ జైల్లో తలారీ లేడు.. నెలరోజుల్లోనేమో నిర్భయ నిందితులకు ఉరిశిక్ష.. అసలేం జరుగుతోంది..!

2012లో డిసెంబర్‌ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్యాచారం ఘటన నిర్భయ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు రాక్షసులుగా ప్రవర్తించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 20 న మరణించింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా మార్చారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. నేరానికి పాల్పడ్డ వారిలో ఒకరు బాల నేరస్థుడు కావడంతో సంస్కరణ గృహానికి పంపించారు. ఒక నేరస్థుడు రాంసింగ్ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్ష పడింది.కాగా, ఈ కేసులోమరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టులో దాఖలైన మెర్సీ పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2012 నాటి కేసులో క్షమా బిక్ష పెట్టాలంటూ నిందితుడు పిటీషన్ పెట్టుకున్నారు. అయితే శంషాబాద్ లో అత్యాచారం కేసు తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తలారీ లేక జైలు అధికారుల టెన్షన్‌ ... టెన్షన్‌...

కాగా, నిర్భయ కేసులో దోషులకు మరో నెలరోజుల్లో మరణశిక్ష పడనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు టెన్షన్‌ పడుతున్నట్లు తెలుస్తోంది. నిర్భయ కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న వినయ్‌శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీ చేసే అవకాశముందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.

దీంతో ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనూ పదవీ విరమణ చేసిన జైలు తలారీలు ఎవరైనా ఉన్నారా ? అని వెతికే పనిలోఉన్నారు జైలు అధికారులు ఉరి తీసే తలారీని కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారు.

క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ సర్కార్‌:

నిర్భయ కేసులో దోషుల్లో ఒక్క వినయ్ శర్మనే క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పటిషన్‌ను తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి పంపించగా, ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకొని దాన్ని లెఫ్టినెంట్ గవర్నరుతో పాటు సీఎం అర్వింద్ కేజ్రీవాల్ లు కూడా తిరస్కరించారు. ఇలాంటి వారికి ఉరి శిక్షే సరి అని, ఉరి శిక్షవిధిస్తే ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నరు ఆ పిటిషన్ ను కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించారు. అయితే అది రాష్ట్రపతి పరిశీలనకు రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. నిర్భయ ఘటనలో దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టవద్దని లేఖ లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్ లకు మరణశిక్షను అమలు చేయనున్నారు.

Next Story