నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటిషన్‌లో కొత్త ట్విస్ట్‌

By Newsmeter.Network  Published on  7 Dec 2019 11:38 AM GMT
నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటిషన్‌లో కొత్త ట్విస్ట్‌

దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 15న నిర్భయపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె డిసెంబర్‌ 20న మృతి చెందింది. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడగా, ఒక నిందితున్ని మైనర్‌ అని శిక్ష విధించలేదు. నిందితుల్లో వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇప్పుడు ఈ క్షమాభిక్ష పిటిషన్‌లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు తాను క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం చేయనేలేదనీ... ప్రస్తుతం తన పేరిట ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ వినయ్ శర్మ అభ్యర్థించడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఇప్పటికే అతడు లేఖ రాఖ రాసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌లో తన సంతకం లేదని, అది తాను పెట్టుకున్నది అసలే కాదని వినయ్‌ శర్మ లేఖలో చెప్పుకొచ్చాడు. కాగా క్షమాభిక్షను తిరస్కరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం పంపిన సిఫారసులను కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. క్షమాభిక్షను తిరస్కరిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇటీవలే కేంద్రానికి ఫైలు పంపించారు.

కాగా, నిర్భయ కేసులో వినయ్‌ శర్మతోపాటు మొత్తం ఆరుగురు నిందితులున్నారు. ఈ కేసులో ప్రధాని నిందితుడైన రామ్‌సింగ్‌ 2013 మార్చి నెలలో జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్‌ అని గుర్తించి, బాలనేరస్తుల కోర్టు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించి అనంతరం విడుదల చేసింది. ఇక ఆరుగురు నిందితుల్లో నలుగురైన నిందితులు అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, ముఖేశ్‌ సింగ్‌, వినయ్‌ శర్మలకు ఉరిశిక్ష వేయాల్సి ఉంది. కాగా, దిశ ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసుల్లో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో వీరికి ఉరి శిక్షలో ఎలాంటి మార్పు ఉండబోదన్న సంకేతాలు స్పష్టమవుతోంది.

Next Story