నిర్భయ దోషులకు మరింత భద్రత

By అంజి  Published on  26 Jan 2020 3:54 AM GMT
నిర్భయ దోషులకు మరింత భద్రత

ఢిల్లీ: సంచలనాత్మక నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరి తియ్యనున్నారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు తీహార్ జైలులోనే నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఐతే ఉరిశిక్షను ఆలస్యం చేసేందుకు దోషులు రకరకాల కారణాలు అన్వేషిస్తున్నారు. రివ్యూ పిటిషన్, క్యురేటివ్, మెర్సీ పిటిషన్లంటూ డ్రామాలాడుతున్నారు. ఇక ఉరిశిక్షకు గట్టిగా వారం రోజులు కూడా సమయం లేదు కాబట్టీ వారు దేనికైనా తెగించే అవకాశముంది. ఈ క్రమంలో తీహార్ జైలులోని దోషులు ఉండే బ్యారక్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

నిజానికి తీహార్ జైలులో ముఖ్యమైన కేసుల్లోని దోషులను నిర్బంధిస్తారు. తీహార్ జైలులో దాదాపు 18వేల మంది ఖైదీలున్నారు. వారిలో ముంబై గ్యాంగ్ స్టర్ చోటా రాజన్, ఢిల్లీ డాన్ నీరజ్ బవానా, బీహార్ క్రిమినల్ షాబుద్దీన్ వంటి కరడుగట్టిన నేరస్తులున్నారు. ఐతే వీరందరికంటే నిర్భయ దోషులకే కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

నిర్భయ దోషులను జనవరి 16న జైలులోని మూడో నంబరు గదికి తరలించారు. 6X8 అడుగులున్న గదుల్లో ఒక్కొక్కరిని విడివిడిగా ఉంచారు. వారు ఆత్మహత్య చేసుకోకుండా, శరీరానికి ఎలాంటి గాయం చేసుకోకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఆ జైలుగదిలో ఏ విధమైన రెయిలింగ్‌లు, రాడ్లతో పాటు ఎలాంటి లోపపు వస్తువులు లేకుండా అధికారులు చర్యలు తీసుకు. వీరున్న ప్రతి జైలు గది దగ్గర ఇద్దరు గార్డ్‌లు 24 గంటలూ కాపలా ఉంటారు. గదుల్లో ఉన్న అటాచ్డ్‌ టాయిలెట్స్‌‌లో కూడా వారిపై నిఘా ఉంచేలా ఏర్పాట్లు చేశారు. వారి గదులను రోజుకు రెండు సార్లు గార్డులు పరిశీలిస్తారు. ఇవన్నీ కాకుండా ప్రతీ గదిలో రెండు సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ ఆఫీస్‌లో ఉన్న కంట్రోల్‌ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. వీరి రక్షణ కొరకు రోజుకి రూ.50000 ఖర్చు చేస్తునట్టు సమాచారం.

జైలు గదుల్లో ఎలాంటి వస్తువులు లేకపోవడంతో.. ఫ్రస్ట్రేషన్, టెన్షన్ తో దోషులు తమను తాము గాయపరచుకోవడానికి తలను గోడకు బాదుకునే అవకాశం ఒక్కటే ఉంది. వారు అలా చేస్తే క్షణాల వ్యవధిలోనే వారి ప్రయత్నాలను నిలువరించేలా ఏర్పాట్లు కూడా చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామ్‌సింగ్ మార్చి 11, 2013లో జైలు గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అలాంటి ఘటనలు ఎవైనా జరిగితే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఏ చిన్నపొరపాటు జరిగినా అధికారులకు మాట వస్తుంది కాబట్టీ దోషులున్న గదుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దోషులను వైద్యులు ప్రతిరోజూ పరీక్షించి నివేదికలను ఉన్నాతాధికారులకు పంపుతున్నారు. ఇక నలుగురు దోషుల్లో పవన్ తప్ప మిగిలిన ముగ్గురిలో ఎలాంటి ఆందోళన లేదు. పవన్ మాత్రం కొన్నిసార్లు ఆహారం తినడం లేదని అధికారులు తెలిపారు.

Next Story