ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి 10 ఫైరింజన్లు

By సుభాష్  Published on  18 Jun 2020 7:02 AM GMT
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి 10 ఫైరింజన్లు

ఢిల్లీలోని రోహిణి కోర్టులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్టులోని మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 10 అగ్నిమాపక శకటాలు ఘటన స్థలాకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే షాట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా భవనంలో ఉన్నవిలువైన ఫైళ్లు, ఫర్నిచర్స్‌, ఇతర వస్తువులు కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఈ మధ్యకాలంలో ఢిల్లీలో అనేకమార్లు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. కాగా, జూన్‌ 30న వాల్మికీ బస్తీలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 200 ఇళ్లకు పైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన స్థలానికి 20ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అలాగే మే 26వ తేదీన కూడా ఉదయం మురికి వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 1500 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఘటన స్థలానికి 30 ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పితే కానీ, అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో కొందరు అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఇలా ఎన్నో అగ్నిప్రమాదాలు సంభవించడంతో బాధితులు నిరాశ్రయులవుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడుతున్నారు.

Next Story
Share it