బిగ్‌బ్రేకింగ్: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 30 ఫైరింజన్లతో..
By సుభాష్ Published on 6 May 2020 2:49 AM GMTఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిక్రీ బోర్డర్ ఏరియాలో ఓ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు కమ్ముకున్నాయి.
భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మరో వైపు గోదాములో బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్న కారణంగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో గోదాం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలను సైతం ముందు జాగ్రత్తగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారీగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అయితే ఢిల్లీలో తరచూ అగ్నిప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ నెలలో భారీ అగ్నిప్రమాదాల వల్ల 45 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ఝూన్సీ రోడ్డులో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 45కిపైగా మృత్యువాత పడ్డారు.