ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ర్టపతి హమిద్ అన్సారీ, కేంద్రమంత్రి జైశంకర్, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలంతా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

యమున విహార్ లోని సీ 10 బ్లాక్ పోలింగ్ కేంద్రం, సర్దార్ పటేల్ మహా విద్యాలయలోని 114వ బూత్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ మొదలవ్వలేదు. షాహీన్ బాగ్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సివిల్ లైన్స్ లో గల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన..తమ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

విదేశాంగ మంత్రి జైశంకర్ తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని ఎన్ఎండీసీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఎడ్యుకేషన్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా రాష్ర్టపతి హమిద్ అన్సారీ న్యూ ఢిల్లీలోని అసెంబ్లీ పరిధిలో ఉన్న నిర్మాణ్ భవన్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని ఎన్ఎండీసీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఎడ్యుకేషన్ లో ఓటు వేశారు. అలాగే కేంద్రమంత్రి హర్ష వర్థన్ కుటుంబ సమేతంగా వచ్చి కృష్ణానగర్ లోని రతన్ దేవి పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కుటుంబ సమేతంగా గ్రేటర్ కైలాష్ పోలింగ్ కేంద్రంలో..చాందినీ చౌక్ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ మహిళా నేత అల్కాలాంబా ఠాగూర్ గార్డెన్ లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Delhi Elections 2ఓటు ప్రాముఖ్యతను చాటుతూ..ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. పెళ్లి దుస్తుల్లో..కుటుంబ సమేతంగా వచ్చి క్యూ లో నిలబడి ఓటు వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.