ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు అవుట్.. ఇంకో ఇద్దరు ఆటగాళ్లు డౌట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2020 3:03 PM GMT
ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు అవుట్.. ఇంకో ఇద్దరు ఆటగాళ్లు డౌట్

ఢిల్లీ కేపిటల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. ఇంకో రెండు-మూడు మ్యాచ్ లు గెలిస్తే క్వాలిఫయర్లకు వెళ్ళిపోయినట్లే..! ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ ను ఆటగాళ్ల గాయాలు కలవర పెడుతూ ఉన్నాయి. ఇప్పటికే అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మలు టోర్నమెంట్ నుండి వైదొలిగారు.

గాయం కారణంగా పంత్ కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ పంత్ ఆడలేదు.. రాజస్థాన్ తో మ్యాచ్ విషయంలో కూడా దూరంగా ఉన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం కాబోతున్నాడట.

బుధవారం రాత్రి దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడి.. అర్ధాంతరంగా ఫీల్డ్ నుంచి వెళ్లిపోయాడు. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బంతిని ఆపే ప్రయత్నంలో కిందపడ్డాడు. అతని ఎడమ భుజానికి గాయమైంది. ఫిజియో వచ్చి అయ్యర్ ను పరిశీలించాడు. నొప్పితో బాధపడుతూ ఉన్న అయ్యర్ అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన మ్యాచ్ కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రతపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని శిఖర్ ధావన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. ఢిల్లీ కేపిటల్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌ తో శనివారం సాయంత్రం ఢిల్లీ ఆడబోతోంది. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి తప్పుకోగా.. ఢిల్లీ కెప్టెన్ అయ్యర్, భారీ హిట్టర్ రిషబ్ పంత్ తిరిగి గ్రౌండ్ లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story