ఢిల్లీ ప్లైట్ ఎక్కుతున్నారా? అయితే..మాస్క్‌ లు పట్టుకెళ్లండి..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 12:36 PM GMT
ఢిల్లీ ప్లైట్ ఎక్కుతున్నారా? అయితే..మాస్క్‌ లు పట్టుకెళ్లండి..!!

ముఖ్యాంశాలు

  • ఢిల్లీని ఆక్రమించిన కాలుష్యం
  • కాలుష్యానికి తోడు పొగమంచు
  • 32 విమానాలు దారి మళ్లింపు

దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. దాదాపు మూడు వారాలుగా ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. నగరం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. పొగకు, మంచు తోడవంతో పరిస్థితి ప్రమాద కరంగా మారింది. హానీకర వాయువు భారీ స్థాయిలో చేరడంతో గాలి నాణ్యత దిగజారిపోయింది. ఆనంద్ విహార్, ఆర్‌.కె.పురం తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ సివియర్ ప్లస్ స్థాయికి చేరింది.

దట్టమైన పొగమంచు కారణంగా వెలుతురు మందగించింది. సమీప దూరంలో ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. పొగ కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. విమాన సేవ లకు కూడా విఘాతం కలిగింది. దాదాపు 32 విమాన సర్వీసులను రద్దు చేశారు.

Image

ఢిల్లీ కాలుష్యంపై రాజకీయం చేయవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పరిసర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కలసి పరిష్కారాన్ని అన్వేషించాలని కోరారు. కాలుష్యం నెపాన్ని ఇతరులపై వేయడం లేదని, శాశ్వత పరిష్కారం కావాలన్నదే తన తపన అని చెప్పారు. కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఢిల్లీ ప్రజలు కూడా చాలా త్యాగాలు చేశారని తెలిపారు.

Image

కేంద్రం కూడా సత్వరమే రిలీఫ్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ సర్కారు మాత్రమే వాయు కాలుష్యాన్ని తగ్గించలేదని, కేంద్రం సహకారం కూడా అవసరమని చెప్పారు. ఢిల్లీ కాలుష్య ప్రభావం రాజస్థాన్‌పై కూడా పడుతోందని, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు.

ఇక, ప్రజల బాధలు అంతా ఇంతా కాదు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ప్రజలు అవస్థ పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, కళ్ల నుంచి నీరు కారడం తదితర సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నవంబరు 5 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రజలకు 50 లక్షల మాస్కులు పంపిణీ చేశారు. వాయు నాణ్యత పూర్తిగా క్షీణించడంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పలు నిబంధన లు అమల్లోకి తెచ్చారు. బాణసంచా వినియోగాన్ని నిషేధించారు. వారం రోజుల పాటు నిర్మాణ పనులను ఆపేయాలని ఆదేశించారు.

Image

Image

Image

Next Story