ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.. ఓటమిపై వార్నర్‌ అసంతృప్తి

By సుభాష్  Published on  19 Oct 2020 7:24 AM GMT
ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.. ఓటమిపై వార్నర్‌ అసంతృప్తి

గెలిచే మ్యాచ్‌లు ఓడిపోతుండంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ను బాగానే ప్రారంభించినప్పటికి ముగింపులో విఫలమవుతున్నామని అన్నాడు. ఆదివారం రాత్రి అబుదాబిలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి అనంతరం వార్నర్‌ మాట్లాడాడు. ' ఏం మాట్లాడాలో.. ఎలా మొదలు పెట్టాలో.. అర్థం కావడం లేదు. గత మూడు మ్యాచుల్లో గెలుపు అంచుల దాకా వచ్చాం. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. మ్యాచ్‌ ముగింపులో మేం విఫలం అవుతున్నాం. ఈ పిచ్ ఛేజింగ్‌కు అనుకూలం కావడంతోనే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నా. ఇదేం మా ఫలితంపై ప్రభావం చూపలేదు. 165 పరుగులు చేధించడం కష్టమేం కాదు. కానీ కీలక సమయంలో మేం వికెట్లు కోల్పోయాం. ఇక కేన్ తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యతో బాధపడ్డాడు. ఫిజియో సహకారం తీసుకోవాల్సి వచ్చింది. దాంతోనే కేన్‌ ఓపెనర్‌గా వచ్చాడు. తర్వాతి మ్యాచ్‌లకు కేన్‌ అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం 'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బసిల్ థంపీ ఒక వికెట్ తీశాడు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. వార్నర్‌తో పాటు బెయిర్ స్టో(36), విలియమ్సన్(29) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా కమిన్స్, మావీ,వరుణ్ తలో వికెట్ పడగొట్టారు. దీంతోఒ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌ కేవలం 2 పరుగులే చేసింది. సులువైన లక్ష్యంతో చేదనకు దిగిన కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్‌ పనిని పూర్తి చేశారు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. అయినప్పటికి మెరుగైన రన్‌రేట్‌ కారణంగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Next Story