మంకీ పాక్స్ గురించి మనోళ్లు పెద్దగా ఆందోళన చెందడం లేదా: సర్వేలో సంచలన నిజాలు
మంకీ పాక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తింది. భారతదేశంలో కేవలం 6% మంది మాత్రమే మంకీ పాక్స్ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Aug 2024 12:15 PM ISTమంకీ పాక్స్ గురించి మనోళ్లు పెద్దగా ఆందోళన చెందడం లేదా: సర్వేలో సంచలన నిజాలు
మంకీ పాక్స్ (Mpox) ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తింది. భారతదేశంలో కేవలం 6% మంది మాత్రమే మంకీ పాక్స్ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీ పాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో మంకీ పాక్స్ విస్తరించి ఉంది.. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఎంపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్ వల్ల ఆఫ్రికాలో ఇప్పటివరకు 500 మందికి పైగా మరణించారు. వైరస్ వ్యాప్తిని ఆపడానికి డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ సహాయం కోరింది.
మంకీపాక్స్, కోవిడ్-19.. ఇతర వైరల్ జబ్బులకు సంబంధించి ప్రజలలో ఆందోళన స్థాయిని అర్థం చేసుకోవడానికి ప్రజలతో లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే చేసింది. భారతదేశంలోని 342 జిల్లాల్లో ఉన్న పౌరుల నుండి 10,000 కంటే ఎక్కువ మంది స్పందనను తెలుసుకున్నారు. 68% పురుషులు, 32% మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. 43% మంది ప్రతివాదులు టైర్ 1 నుండి, 25% మంది టైర్ 2 నుండి, 32% మంది ప్రతివాదులు టైర్ 3 జిల్లాలకు చెందినవారు. అయితే ఈ సర్వేలో చాలా మందికి మంకీ పాక్స్ విషయంలో ఆందోళన లేదని తెలుస్తోంది.
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తాయి. ఈ పరిస్థితి రెండు నుంచి నాలుగు వారాలు ఉంటుంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది. కాని కొన్ని సందర్భాల్లో అది మరణానికి దారితీస్తుంది.
మన వాళ్లలో పెద్దగా ఆందోళన లేదు:
మంకీ పాక్స్ విషయంలో కేవలం 6% భారతీయులు మాత్రమే ఆందోళన చెందుతున్నారని సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో కేవలం 6% మంది మాత్రమే మంకీ పాక్స్ గురించి ఆందోళన చెందుతున్నారని సర్వే కనుగొంది; 13% మంది కోవిడ్ ఇన్‌ఫెక్షన్ గురించి, 29% మంది ఇతర సీజనల్ వైరల్ వ్యాధుల గురించి ఆందోళన చెందుతున్నారు.
"ఈ సమయంలో మీరు, మీ కుటుంబం ఏ వైరస్ సంక్రమణ గురించి ఆందోళన చెందుతున్నారు?" అని సర్వేలో పౌరులను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు 10,189 ప్రతిస్పందనలు వచ్చాయి. 13% "COVID" గురించి చెప్పగా.. 6% "మంకీపాక్స్" గురించి తెలిపారు. 29% మంది “వాటిలో ఏదీ లేదు” అని.. 29% మంది “ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు” అని పేర్కొన్నారు. 23% మంది స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
భారతదేశంలో అధికారికంగా ఎటువంటి నివేదికలు లేవు:
ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. అధికారికంగా భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు లేవు. కేసుల సత్వర గుర్తింపు కోసం నిఘా పెంచాలని, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పీఎంవో ఆదేశించింది. అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గ్రౌండ్ క్రాసింగ్‌లలోని ఆరోగ్య విభాగాలను పటిష్టం చేయడం వంటి కొన్ని చర్యలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అధికారులు నిర్ణయించారు. 32 టెస్టింగ్ లేబొరేటరీలను సిద్ధం చేశారు. ఏదైనా కేసును గుర్తిస్తే ఐసోలేట్ చేయడం.. ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలను సిద్ధం చేయడం మొదలైనవి ఉన్నాయి.
భారతదేశంలో మంకీపాక్స్ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి. కె. మిశ్రా, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి ప్రకాష్ నడ్డాతో అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భారతదేశంలో చాలా మంది వాతావరణంలో వచ్చే మార్పుల ద్వారా వచ్చే రోగాలు, వైరల్ ఫీవర్ లతో బాధపడుతున్న సమయంలో మంకీ పాక్స్ గురించి ఆరోగ్య విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
మంకీ పాక్స్ గురించి:
మంకీ పాక్స్ ఒక అంటువ్యాధి. సాధారణంగా 2-4 వారాల సమయంలో ఇది మనిషిపై ప్రభావాన్ని చూపుతుంది. రోగులు సాధారణంగా కోలుకుంటారు. ఇది సోకిన వ్యక్తుల నుంచి సులభంగా అవతలి వారికి సోకుతోంది. మంకీపాక్స్ సోకిన వారితో దగ్గర అనుబంధం ఉన్న వారికి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఎంపాక్స్ సోకిన వ్యక్తుల్లో మొదట దీని తీవ్రత సాధారణంగానే ఉన్నప్పటికీ, కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతోంది. దీని బారిన పడిన వారిలో తొలుత ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. శరీరంపై గాయాలు కూడా అవుతాయి.
ప్రపంచవ్యాప్తంగా 2022 నుండి, WHO 116 దేశాలలో మంకీపాక్స్ కారణంగా 99,176 కేసులు నమోదవ్వగా.. 208 మరణాలను నివేదించింది. WHO 2022 డిక్లరేషన్ చేసినప్పటి నుండి, భారతదేశంలో మొత్తం 30 కేసులు మార్చి 2024 నాటికి కనుగొన్నారు.
భారత్ లో వ్యాపించే అవకాశం ఎక్కువ:
పాకిస్తాన్, కొన్ని ఇతర ఆసియా దేశాలలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఎటువంటి పరిమితులు లేవు, త్వరలో భారతదేశంలో కేసులు ఎక్కువగా గుర్తించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. "విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌తో పాటు, మంకీపాక్స్ విషయంలో రాష్ట్రాలు తమ జిల్లా స్థాయిలో నిఘాను ఉంచడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి" అని లోకల్ సర్కిల్స్ అభిప్రాయపడింది.