బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

By సుభాష్  Published on  12 Oct 2020 10:37 AM GMT
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం విశాఖపట్నం కు ఆగ్నేయ దిశలో 280 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశలో 320 కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ తూర్పు ఆగ్నేయ దిశలో 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారనున్న అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర కోస్తా తీరం వైపు కొనసాగనుందని, ఈ తీవ్ర వాయుగుండం విశాఖపట్నం - నరసాపురం కి మధ్యలో కాకినాడ కి సమీపంలో రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలో 20 సెంటీమీటర్ల పైన వర్షం పడే అవకాశం ఉందని వివరించారు. సోమవారం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే రేపు ఉదయం తీరం దాటిన తర్వాత ఇది తెలంగాణ మీద గుండా ప్రయోగించే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా ఈరోజు, రేపు ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఆయన హెచ్చరించారు. అలాగే ఈనెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

Next Story