కిమ్‌కు కోపమొచ్చింది.. మరో సంచలన నిర్ణయం
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 11:12 AM ISTఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ఉన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణకొరియాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. తమ శత్రు దేశంతో భవిషత్య్తులో ఎలాంటి సంబంధాలు ఉండబోవని చెప్పే దిశగా ఇది తొలి అడుగు అని ఉత్తర కొరియా అధికారిక ఛానల్ కేసీఎన్‌ఏ వెల్లడించింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గాలిబుడగలు అట. దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు కిమ్ నియంతృత్వ దోరణిని నిరసిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. దాంతో పాటు కిమ్‌ను దుయ్యబడుతూ కరపత్రాలను గాల్లోకి విసిరారు. దీనిపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. ఉత్తరకొరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరిహద్దు మీదుగా వస్తున్న గాలిబుడగల కరపత్రాలను నిలువరించడంలో దక్షిణ కొరియా ప్రభుత్వం విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యాంగ్యాంగ్‌లోని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక కిమ్ సోదరి కిమ్ మో జోంగ్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఈ గాలి బుడగల వ్యవహారం ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద బెలూన్లను ఎగుర వేస్తున్నారు. కాగా ఇప్పటికే ఓ సారి కిమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వీటిని గనుక నిలవరించకపోతే.. సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన కార్యాలయాలను పూర్తిగా మూసివేస్తామని గతంలోనే హెచ్చరించారు. అప్పట్లో దక్షిణ కొరియా ఈ బుడగలపై నిషేదం విధిస్తామని ప్రకటించినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేకపోవడంతోనే.. కిమ్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.