మహిళల శాపం వల్లే అజంఖాన్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
By Medi Samrat
సమాజ్ వాది పార్టీ నాయకుడు అజంఖాన్ పై ప్రముఖ సినీ నటి, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద విమర్శల వర్షం కురిపించారు. ఒకప్పుడు మహిళలు అజంఖాన్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్నారు అని.. వారి శాపం వల్లే అతను ఇప్పుడు ఏడుస్తున్నారని అన్నారు. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న జయప్రద ఈ వ్యాఖ్యలు చేశారు. తనను మంచి నటి అని చెప్పే అజంఖాన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచార సభల్లో అద్భుతంగా నటిస్తున్నాడు అన్నారు.
సమాజ్ వాది పార్టీ నాయకులు అజంఖాన్ కు మహిళలను కించ పరచడం అలవాటు. గతంలో ఆయన మాటలకు ఎన్నోసార్లు జయప్రద కన్నీరు పెట్టుకున్నారు. దివంగత నేత సుష్మా స్వరాజ్ సైతం ఆజంఖాన్ వ్యాఖ్యలపై మండిపడుతూ ఉండేవారు. మహిళా స్పీకర్ పై నిండు సభలో అజంఖాన్ చేసిన వ్యాఖ్యలకు ఓసారి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. అలాంటి అజంఖాన్ ఇప్పుడు రాంపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో తన భార్య తజిన్ ఫాతిమా పక్షాన ప్రచారం చేస్తున్నారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ ప్రచార సభలో కన్నీరు పెట్టుకున్నారు. ఒక విశ్వవిద్యాలయ భూములు ఆక్రమించారంటూ అజంఖాన్ పై 80 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేస్తుంది.