కోల్‌కతాలో కరెన్సీ కట్టల వాన..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Nov 2019 4:49 AM GMT
కోల్‌కతాలో కరెన్సీ కట్టల వాన..!

ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది. మన ఎదురుగా అలా డబ్బులు పడుతూ ఉంటే ఏం చేస్తాం.. ఎంచక్కా ఏరుకోమూ.. అచ్చంగా ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. ఓ బిల్డింగ్ నుంచి నోట్లు రోడ్డుపై పడటంతో జనం పోటా పోటీగా వాటిని ఏరుకున్నారు.

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ భవనం నుంచి నిన్న మధ్యాహ్నం నోట్ల వర్షం కురిసింది. ఆరో అంతస్తు నుంచి కిందపడుతున్న నోట్లను పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. బెంటిక్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు జరిపారు. అందులోని ఆరో అంతస్తులో ఎగుమతి-దిగిమతుల వ్యాపారం నిర్వహించే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుంకం చెల్లించకపోవడంతో అధికారులు దాడులు చేశారు. వారి రాకను గమనించిన హోఖ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బంది ఆరో అంతస్తులోని కిటికీ నుంచి నోట్ల కట్టలను కిందికి విసిరేశారు.

పై నుంచి కురుస్తున్న నోట్ల వర్షాన్ని చూసిన జనం తొలుత ఆశ్చర్యపోయారు. ఆపై తేరుకుని అందినంత పట్టుకుని ఎంచక్కా వెళ్లిపోయారు. కిందపడిన నోట్లలో రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయి.. అయితే ఇంతకీ నోట్లు ఏరుకోకుండా వీడియో తీసిన వ్యక్తికి డబ్బులేమన్నా దక్కాయా లేదో మరీ.Next Story