ఈ భారీ వర్షాలకు కారణం ఏంటో తెలుసా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Sep 2019 2:36 PM GMTహైదరాబాద్: కొన్ని రోజులుగా వాతావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. మంచి ఎండతో మొదలయి, కొద్దిసేపటికి మబ్బులు కమ్మేసి, ఆకాశం చీకటిగా మారి భారీ వర్షం కురుస్తోంది. అసలు ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు వాన వస్తుందో ప్రజలకు అర్ధం కావడం లేదు. బంగాళా ఖాతం లో అల్పపీడనం కారణంగా తెలంగాణాలోని వివిధ ప్రాంతల్లో ఒక మోస్తరు నుంచీ భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగానే హైదరాబాదులోనే కాక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతీ రుతుపవనాలు , బంగాళా ఖాతంలో అల్పపీడనం వల్ల మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. నల్లని మబ్బులు కమ్మేసి కుండపోతగా వర్షం కురుస్తుంది. అయితే, చీకట్లు కమ్ముతూ వచ్చే ఈ నల్లని మేఘల్ని ‘క్యుములోనింబస్ మేఘాలు’ అంటారు. వేసవిలో ఈ మేఘాలు ఏర్పడుతుంటాయి. వానాకాలంలో కూడా ‘క్యుములోనింబస్ మేఘాలు’ ఏర్పడటం ఆశ్చర్యమే అంటున్నారు వాతావరణ అధికారులు. దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే .
తేమ గాలులు, పొడిగాలులు వ్యతిరేక దిశలో వచ్చి ఒకేచోట కలవడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. సాధారణ మేఘాలు సమాంతరంగా వ్యాపిస్తే, క్యుములోనింబస్ మేఘాలు మాత్రం భూమి నుంచి పైకి నిట్టనిలువుగా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడతాయి. ఇవి ఏర్పడితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వస్తాయి. తక్కువ సమయంలో కుంభవృష్టి పడుతుంది. ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు 'క్యుములోనింబస్ మేఘాలే 'కారణం అంటున్నారు అధికారులు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి. కానీ, ఈ ఏడాది అక్టోబర్ వరకూ కొనసాగే పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది వేసవిలో, ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఎండలు, ఎక్కువ వానలు కూడా వాతావరణంలోని మార్పులు వల్లనేనని అంటున్నారు అధికారులు.గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. రావాల్సిన రుతుపవనాలు సమయానికి రావడం లేదు. రుతుపవనాల లేట్‌తో పంటలు సకాలంలో వేయడం లేదు. దీంతో ఆశించిన పంట రైతులకు రావడం లేదు. పడకూడని సమయంలో వర్షాలు కురుస్తుండటంతో విష జ్వారాలు ప్రభలుతున్నాయి.
మరో నాలుగు రోజుల పాటు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అరేబియా సముద్రంలో కూడా వాయుగుండం ఏర్పడింది. దీంతో గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.