సూర్యాపేట జిల్లాలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై స‌మీక్ష‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2020 11:11 AM GMT
సూర్యాపేట జిల్లాలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై స‌మీక్ష‌

సూర్యాపేట‌లో జిల్లాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, వైద్య శాఖ సంచాల‌కుడు శ్రీనివాస్ బుధ‌వారం సూర్యాపేట‌లో ప‌ర్య‌టించారు. క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోదైన సూర్యాపేట కూర‌గాయ‌ల మార్కెట్ ను సంద‌ర్శించారు. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను స్థానిక అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

కంటైన్మెంట్ జోన్లలో జీరో మూవ్ మెంట్ చర్యలు : సీఎస్‌ సోమేశ్‌కుమార్

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో మొత్తం 83 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. క‌రోనా వ్యాప్తి జిల్లాలో పెర‌గడానికి గ‌ల కార‌ణాల‌పై స‌మీక్ష నిర్వ‌హించామ‌న్నారు. దీనిపై మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అదనపు అదికారులను నియమించామ‌ని, కంటైన్మెంట్ జోన్లలో జీరో మూవ్ మెంట్ చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు. ఆర్ అండ్ బీ వాళ్లకు తగిన సూచనలు చేశామ‌ని, ఆయా ప్రాంతాలకు కొత్తవారు ఏవరు వచ్చారనేదానిపై సర్వే చేయాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. క్వారంటైన్ లో ఉన్నవారికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనే దానిపై సూచనలు చేశామ‌న్నారు. మాకు నమ్మకం ఉంది.. త్వరలోనే జిల్లాలో క‌రోనా వైర‌స్ కంట్రోల్ లోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వాళ్లకు పూర్థిస్థాయిలో మద్ధతుగా ఉంటామ‌న్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామ‌ని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

క‌రోనాను క‌ట్ట‌డి చేస్తాం : డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమ‌త్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు హై లెవల్ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సంద‌ర్శిస్తున్నామ‌ని, జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ ఇవ్వడానికే తాము వచ్చామని చెప్పారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంద‌ని, సూర్యాపేట జిల్లాలో కూడా మహమ్మారీని కట్టడి చేస్తామ‌ని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ఏరియాలో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామ‌ని, పక్క పక్క ఇళ్ల వారు కూడా కాంటాక్ట్ లో ఉండకూడదన్నారు. కంటేన్మెంట్ ఏరియాలోకి బయటివారు లోప‌లికి రాకుండా.. లోపలి వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. భవిష్యత్ లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేలా పలు సూచనలు చేశామ‌న్నారు. అన్నీ శాఖలకు సహాయ సహకారం అందిస్తూ పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, అతి త్వరలోనే జిల్లాలో వైరస్ కట్టడి అవుతుందన్న విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. జిల్లా ప్రజలు లాక్ డౌన్ అమలుకు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు.

Next Story