పెళ్లి పేరుతో మోసం.. 'పక్కింటి కుర్రాడు'ని అరెస్ట్ చేసిన పోలీసులు

యూట్యూబ్‌లో ఫేమస్‌ అయిన పక్కింటి కుర్రాడు.. చందు సాయిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

By Srikanth Gundamalla  Published on  15 Dec 2023 3:16 PM IST
youtuber, chandu sai, arrest,  narsingi police,

 పెళ్లి పేరుతో మోసం.. 'పక్కింటి కుర్రాడు'ని అరెస్ట్ చేసిన పోలీసులు

యూట్యూబ్‌లో ద్వారా వీడియోలు చేస్తూ చాలా మంది ఈ మధ్యకాలంలో ఫేమస్‌ అవుతున్నారు. అంతేకాదు.. మంచి కంటెంట్‌తో వీడియోలు తీసి.. వ్యూస్‌ బాగా వచ్చాయంటే బాగానే సంపాదిస్తుంటారు. అలా ఫేమస్‌ అయిన వారిలో ఒకడే యూట్యూబర్‌ చందు సాయి. సమాజానికి ఉపయోగపడే, సందేశాలను ఇచ్చేలా కొన్ని వీడియో చేశాడు. పక్కింటి కుర్రాడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసి మోసం చేశాడని అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి చందు సాయిని రిమాండ్‌కు కూడా తరలించారు.

హైదరాబాద్‌ నగర శివారు నార్సింగికి చెందిన ఓ యువతి యూట్యూబర్‌ చందు సాయిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. చందు సాయి తనని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని ఫిర్యాదులో బాధిత యువతి పేర్కొంది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత తనని పట్టించుకోలేదని.. ముఖం చాటేశాడని చెప్పింది. మోసపోయానని గ్రహించాకే పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు కంప్లైంట్‌లో బాధిత యువతి పేర్కొంది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌ చందు సాయిపై రేప్‌, చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

బాధిత యువతి చందు సాయి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొంది. ప్రేమ పేరుతో గతంలో తన పుట్టిన రోజు అని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడని తెలిపింది. 2021 ఏప్రిల్ 25న తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో చెప్పింది. చందు సాయి అసలు పేరు చంద్రశేఖర్‌ సాయి కిరణ్‌ కాగా.. చందు సాయిగా.. పక్కింటి కుర్రాడుగా యూట్యూబ్‌లో ఫేమస్‌ అయ్యాడు. అత్యాచారం తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని చందు సాయిని కోరానని యువతి పేర్కొంది. ఈ క్రమంలోనే అతడు అడిగితే బంగారం కూడా ఇచ్చానని తెలిపింది. ఈ క్రమంలో చంద్రశేఖర్‌తో పాటు అతని తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కూడా బాధిత యువతి ఫిర్యాదు చేసింది. చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులు పెళ్లి కోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో తెలిపింది. చంద్రశేఖర్‌తో పాటు ఇతరులపైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపోలకి తీసుకుని విచారణ చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌ను రిమాండ్‌కు తరలించారు.

Next Story