మాజీ ప్రియుడిని ఇరికించేందుకు స్కెచ్‌ వేసి బుక్కైన యువతి

ప్రియుడు దూరం పెట్టాడు. దాంతో.. యువతి అతడిపై కక్ష పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.

By Srikanth Gundamalla  Published on  26 Dec 2023 5:27 PM IST
young woman, sketch,   ex-boyfriend, hyderabad,

మాజీ ప్రియుడిని ఇరికించేందుకు స్కెచ్‌ వేసి బుక్కైన యువతి

ప్రియుడు దూరం పెట్టాడు. దాంతో.. యువతి అతడిపై కక్ష పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే గంజాయి కేసులో అతన్ని ఎలాగైనా ఇరికించాలని పెద్ద ప్లాన్‌ వేసింది. కానీ.. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడుతారన్నట్లు.. ఆమెనే చివరకు పోలీసులకు చిక్కింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే రహమత్‌నగర్‌లో నివాసం ఉంటోన్న రింకీ అనే యువతి.. అమీర్‌పేటలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసతోంది. సరూర్‌నగర్‌కు చెందిన శ్రవణ్‌ అనే యువకుడు కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పరిచయం అయ్యాక.. ప్రేమ చిగురించింది. కొంతకాలం అంతా బాగానే ఉండింది. కానీ.. ఆ తర్వాత శ్రవణ్‌ యువతిని దూరం పెడుతూ వచ్చాడు. దాంతో.. శ్రవణ్‌పై కక్ష పెంచుకున్న రింకీ.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. జైలుకు పంపించాలని అనుకుని ఒక ప్లాన్ వేసింది.

తన స్నేహితులతో కలిసి మంగళ్‌హాట్‌లో రూ.4వేలకు 40 గ్రాముల గంజాయిని కొన్నది. ఆ తర్వాత 8 గ్రాముల చొప్పున ఐదు ప్యాకెట్లుగా తయారు చేసి తనవద్దే ఉంచుకుంది. తన స్నేహితులతో శ్రవణ్‌తో మాట్లాడించి అమీర్‌పేట దగ్గరున్న ఓ పార్క్‌కు వచ్చేలా చేసింది. ఆ తర్వాత రింకీ, ఆమె స్నేహితులు.. శ్రవణ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అంతా పబ్‌లో ఉన్న సమయంలో యువతి ఎవరికీ తెలియకుండా ఓ కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసింది. శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని చెప్పింది. ఈ నెంబర్‌ కారులో గంజాయి ఉందనే సమాచారం కూడా ఇచ్చింది.

యువతి ఫోన్‌ కాల్‌తో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. చెప్పినట్లుగానే అందులో గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వెంటనే పోలీసులు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో శ్రవణ్‌ కారు తనది కాదనీ.. ఇతరులతో కలిసి కారులో వచ్చాననీ అన్నాడు. దాంతో.. కారులో పబ్‌కు వెళ్లినవారందరినీ పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు తమైన శైలిలో అందరినీ విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు యువతి ఈ ప్లాన్ వేసినట్లు తేలింది. దాంతో.. ఈ కేసులో రింకీతో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్నారు.


Next Story