ఎంగేజ్‌మెంట్ చెడగొట్టారు అంటూ లెటర్ రాసిన యువతి.. ఆ తరువాత
తన ఎంగేజ్‌మెంట్ చెడగొట్టారని మనస్థాపం చెందిన ఓ యువతి ఇంట్లోంచి వెళ్లిపోయింది
By తోట వంశీ కుమార్ Published on 5 March 2023 1:35 PM ISTప్రతీకాత్మక చిత్రం
మనతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అని మనకు సంబంధించిన అన్ని విషయాలను ఎవ్వరితో పంచుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ విధంగా మారిపోతారో ఎవ్వరు చెప్పలేరు. ఓ యువతి తాను పని చేసే ప్రదేశంలో పరిచయమైన దంపతులతో అన్ని విషయాలను షేర్ చేసుకుంది. ఇటీవల ఆ యువతికి పెళ్లి సంబంధం కుదిరింది. కట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇందుకు ఆ దంపతులు కారణం అంటూ యువతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి కంప్యూటర్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆ కంప్యూటర్ సెంటర్‌కు పక్కనే ఓ ఫోటో షాప్ ఉంది. ఆ షాపు యజమాని వంశీ దంపతులతో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. క్రమంగా వారు స్నేహితులుగా మారారు. యువతి తనకు సంబంధించిన అన్ని విషయాలను వారితో పంచుకునేది.
ఫిబ్రవరి నెలలో యువతికి ఓ వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఎంగేజ్‌మెంట్‌కు తేదీని సైతం ఖరారు చేశారు. అయితే.. ఏం జరిగిందో తెలీదు గానీ అబ్బాయి తరుపు వారు పెళ్లి క్యాన్సిల్ చేశారు. దీంతో యువతి మనస్థాపానికి గురైంది. ఓ సూసైడ్ నోట్ రాసి ఇంట్లోంచి వెళ్లి పోయింది.
తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి వంశీ దంపతులు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పి ఎంగేజ్‌మెంట్ చెడగొట్టారని లెటర్‌లో రాసింది. తాను వెళ్లిపోవడానికి వంశీదంపతులే కారణం అని, కుటుంబ సభ్యులు కాదని పేర్కొంది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. యువతి కోసం గాలింపు చేపట్టారు.