పరీక్ష రాసేందుకు వెళ్లిన నవవధువు.. మ‌ళ్లీ రాలేదు.. చివ‌రికి

Young woman commits suicide in Siddipet.జీవితంపై ఎన్నో ఆశ‌ల‌తో పెళ్లి చేసుకోంది ఓ యువ‌తి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 9:07 AM IST
పరీక్ష రాసేందుకు వెళ్లిన నవవధువు.. మ‌ళ్లీ రాలేదు.. చివ‌రికి

జీవితంపై ఎన్నో ఆశ‌ల‌తో పెళ్లి చేసుకోంది ఓ యువ‌తి. అయితే.. వివాహం అయిన ప‌ది రోజుల‌కే అంతా త‌ల్ల‌క్రిందులైంది. అత్తింట‌ వేదింపులు ఎదుర‌య్యాయి. భ‌ర్త సైతం చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు. క‌న్న‌వారికి త‌న బాధ‌ను చెప్పుకోలేక‌పోయింది. జీవితంపై విర‌క్తి చెంది.. కాళ్ల పారాణి ఆరక ముందే న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. దుబ్బాకలోని చెల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన అక్కల రాధా కిషన్, లక్ష్మి దంపతులకు పవిత్ర అలియాస్ తేజస్విని (22) అనే కూతురు ఉంది. ఆమెను గంభీపూర్ గ్రామానికి చెందిన చేపూరి యాద‌య్య‌. బాల ల‌క్ష్మీల కుమారుడు శ్రీకాంత్ గౌడ్‌కు ఇచ్చి మే 28న వివాహం జ‌రిపించారు. పెళ్లి అనంత‌రం అత్త‌వారింటికి వ‌చ్చి రోజు నుంచి ప‌విత్ర‌కు వేదింపులు ప్రారంభం అయ్యాయి. భ‌ర్త‌, అత్త తీవ్రంగా వేదించ‌సాగారు. దీంతో ప‌విత్ర మాన‌సికంగా క‌ల‌త చెందింది. బుధవారం బీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్ష ఉండటంతో భర్త శ్రీకాంత్‌ గౌడ్‌ ఆమెను దుబ్బాకలోని కాలేజీ వద్ద వదిలి వెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లలేదు.

తన అన్న స్నేహితుడి ఫోన్‌కు ఓ సందేశం పంపించింది. తనకు జీవితంపై విరక్తి కలిగిందని.. ఇక బతకలేనని మెసేజ్ పెట్టి ఫోన్‌ స్విచ్‌ ఆపేసింది. అనంతరం కాలేజీ నుంచి కాలినడకన వెళ్లి పట్టణ సమీపంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పవిత్ర అన్న స్నేహితుడు ఇచ్చిన స‌మాచారంతో కంగారు ప‌డిన ప‌విత్ర కుటుంబ స‌భ్యులు వెంట‌నే దుబ్బాక ప‌ట్ట‌ణం మొత్తం గాలించారు. అయినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో వారు బుధ‌వారం రాత్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం చెరువులో ప‌విత్ర మృత‌దేహాం తేలుతూ క‌నిపించింది.

స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అక్క‌డి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని నీటి నుంచి బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. అత్తింటి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పవిత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story