ప్రేమ‌కు పెద్ద‌లు అంగీక‌రించ‌లేద‌ని.. ప్రేయ‌సికి వీడియో కాల్ చేసి..

Young man suicide in siddipet.తాజాగా ఓ యువ‌కుడు త‌మ ప్రేమ‌కు పెద్ద‌లు అంగీక‌రించ‌లేద‌ని ప్రేయ‌సికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2021 10:16 AM IST
Young man suicide in Siddipet

ఇటీవ‌ల యువ‌త క్ష‌ణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న, చిన్న కార‌ణాల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డుతున్నారు. తాజాగా ఓ యువ‌కుడు త‌మ ప్రేమ‌కు పెద్ద‌లు అంగీక‌రించ‌లేద‌ని ప్రేయ‌సికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట ప‌ట్ట‌ణంలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. సిద్దిపేట హౌసింగ్ బోర్డు ప‌రిధిలోని అరుంధ‌తి కాల‌నీకి చెందిన బి.మ‌నోజ్‌కుమార్‌(25) ల్యాబ్ టెక్నిషియ‌న్‌గా ప‌నిచేస్తున్నాడు. అత‌డు ఓ యువ‌తితో ప్రేమ‌లో ప‌డ్డాడు.

ఈ విష‌యం ఇరు కుటుంబాల‌కు తెలిసింది. దీంతో పెద్ద‌లు పంచాయ‌తీ నిర్వ‌హించి ఇద్ద‌రూ దూరంగా ఉండేలా రాజీ కుదుర్చుకున్నారు. ప్రియురాలు దూరం కావ‌డంతో మ‌నోజ్ తీవ్ర మ‌నోవేద‌న‌కు లోన‌య్యాడు. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాత్రి భోజ‌నం చేసిన అనంత‌రం పై అంత‌స్తులోని త‌న గ‌దిలోకి వెళ్లాడు. అర్థ‌రాత్రి త‌రువాత ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూనే స‌ర్జిక‌ల్ బ్లేడ్‌తో ఎడ‌మ చేతి మ‌ణిక‌ట్టు, గొంతు కోసుకున్నాడు. వెంట‌నే యువ‌తి.. అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించింది. కంగారు ప‌డిన అత‌డి కుటుంబ స‌భ్యులు అత‌డి గ‌దికి వెళ్లగా.. అప్ప‌టికే అత‌డు అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్నాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story