పురుగుల మందు తాగిన‌ట్లు న‌టించ‌మ‌ని చెప్పిన ప్రేయ‌సి.. ప్రియుడి ప్రాణం పోయింది

Young man suicide in nalgonda dist. యువ‌తి.. ప్రియుడికి చెప్పింది. త‌న కోసం పురుగుల మందు తాగిన‌ట్లు న‌టించ‌మ‌ని.. అప్పుడు అంద‌రినీ వ‌దిలి వ‌స్తాన‌ని చెప్పంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 8:36 AM IST
suicide attempt

వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఆ విష‌యం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆ యువ‌తికి వేరే యువ‌కుడితో వివాహాం చేసేందుకు నిశ్చ‌యించారు. ఈ విష‌యాన్ని ఆ యువ‌తి.. ప్రియుడికి చెప్పింది. త‌న కోసం పురుగుల మందు తాగిన‌ట్లు న‌టించ‌మ‌ని.. అప్పుడు అంద‌రినీ వ‌దిలి వ‌స్తాన‌ని చెప్పంది. దీంతో ఆ యువ‌కుడు ప్రేయ‌సి చెప్పిన‌ట్లే పురుగుల మందు తాగాడు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా అనుముల మండ‌లంలో శ‌నివారం చోటు చేసుకుంది.

స్థానికులు, బంధువులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. చింత‌గూడెం గ్రామానికి చెందిన కోటి రాములు(21), అదే గ్రామానికి చెందిన ఓ యువ‌తి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విష‌యం ఆ యువ‌తి కుటుంబంలో కొద్ది రోజుల క్రితం తెలిసింది. దీంతో ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు రాముల‌పై పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌గా.. ఇరుకుటుంబాల‌కు పోలీసులు స‌ర్ది చెప్పి పంపించారు. ఈ నెల 19న ఆ యువ‌తికి మ‌రో యువ‌కుడితో పెళ్లి సంబంధం నిశ్చ‌య‌మైంది. ఈ విష‌యాన్ని ఆ యువ‌తి రాములుకు చెప్పింది. నువ్వు పురుగుల మందు తాగిన‌ట్లు న‌టించాల‌ని.. అలా చేస్తే నేను ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా నీ వ‌ద్ద‌కు వ‌స్తాన‌ని చెప్పింది.

దీంతో రాములు శుక్ర‌వారం రాత్రి గ్రామ శివారులో ఉన్న ధ్యానం కొనుగోలు కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డ పురుగుల మందు తాగాడు. కొద్దిసేప‌టి త‌రువాత త‌న మిత్రుల‌కు ఫోన్ చేసి పురుగుల మందు తాగాన‌ని.. వెంట‌నే వాహనం తీసుకుర‌మ్మ‌ని చెప్పాడు. వెంట‌నే అక్క‌డి వెళ్లిన మిత్రుల‌కు అప‌స్మార‌క స్థితిలో ఉన్న రాములు క‌నిపించాడు. దీంతో అత‌డిని మిర్యాల‌గూడ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్యంలో మృతి చెందాడు. శ‌నివారం మృత‌దేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా.. చింత‌గూడెం గ్రామంలో అంత్య‌క్రియ‌లు పూర్తి అయ్యాయి. దీనిపై యువ‌కుడి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story