పెళ్లైన వారం రోజులకే పుట్టింటికి వెళ్లిన భార్య.. అతడేం చేశాడంటే..?
Young man suicide in Gajwel.భార్య ఇంటికి రానని చెప్పింది. దీంతో అతడు తీవ్ర మనస్థాపం చెందాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 20 April 2021 7:48 AM ISTఅతడో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. అయితే.. వివాహం జరిగిన వారం రోజుల తరువాత అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. అతడు ఎన్ని సార్లు రమ్మని చెప్పినా లాభం లేకపోయింది. తనకు ఇష్టం లేని వివాహం చేశారని.. ఇక మీ ఇంటికి రానని చెప్పింది. దీంతో అతడు తీవ్ర మనస్థాపం చెందాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గజ్వేల్ పట్టణానికి చెందిన పోతిరెడ్డి జీవన్ రెడ్డి(30) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. లాక్‌డౌన్ కరోనా కారణంగా ప్రస్తుతం అతడు ఇంటి నుంచే పని చేస్తున్నాడు. గతేడాది అతడికి మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. అయితే.. పెళ్లైన వారం రోజులకే అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి రమ్మని ఎన్ని సార్లు పిలిచినా.. రానని చెబుతోంది. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారని.. తాను మీ ఇంటికి వచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో జీవన్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉరివేసుకునే ముందు.. భార్య కాపురానికి రావడం లేదనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేసి తల్లికి, బంధువులకు పంపించాడు. వీడియో చూసిన తల్లి వెంటనే బంధువుల సాయంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని జీవన్ కనిపించాడు. వెంటనే అతడిని కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.