నేను చనిపోయాకైనా.. నాది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటావు
Young man suicide in Ameerpet.ఇటీవల కాలంలో యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 19 July 2021 8:50 AM ISTఇటీవల కాలంలో యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ప్రేమించిన అమ్మాయి కాదు అని చెప్పిందనో వారు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వారు ప్రాణాలు తీసుకోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. తాజాగా ఓ యువకుడు.. తను ప్రేమించిన ఓ యువతి తన ప్రేమను కాదన్నందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నా ప్రేమను నువ్వు నమ్మ లేదు. కనీసం నా చావుతోనైనా నాది నిజమైన ప్రేమని నువ్వు తెలుసుకుంటావని చనిపోయే ముందు సెల్పీ వీడియోలో అతడు మాట్లాడాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కె.పి.పాలెంకు చెందిన జి.సుధాకర్(30) బీకేగూడలో మిత్రుడితో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. మిత్రుడితో కలిసి ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ అమ్మాయిని సుధాకర్ ప్రేమించసాగాడు. ఈ విషయాన్ని యువతికి చెప్పగా.. తిరస్కరించింది. దీంతో తీవ్రమనస్థాపానికి లోనైయ్యాడు. కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
తన చావుతోనైనా తనది నిజమైన ప్రేమేనని ఆ యువతి గుర్తించాలని భావించాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని.. రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.