కుమారైను ప్రేమించిన ఓ యువకుడిపై ఆ యువతి కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. నమ్మకంగా గ్రామానికి రమ్మని చెప్పి అతడి కాళ్లు, చేతులను నరికి వేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడుకి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం అయ్యింది. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఆ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
ఈ విషయం ఆ యువతి ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంకటేశ్ ను పిలిపించి గ్రామంలో పంచాయతీ పెట్టారు. కాగా.. అప్పటి నుంచి వెంకటేశ్ గ్రామానికి దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికి అతడు యువతితో మాట్లాడుతూనే ఉన్నాడు. యువతితో మాట్లాడడం ఆపకపోవడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. గత రాత్రి నమ్మకంగా అతడిని గ్రామానికి పిలిపించారు. గ్రామ శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ యువతి తండ్రి.. మరో ఐదుగురితో కలిసి వెంకటేశ్ కాళ్లు. చేతులు నరికివేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.