అతడి వయసు 22 ఏళ్లు. చూడడానికి అందంగా ఉంటాడు. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. అమ్మాయిలను ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఒకరా.. ఇద్దరా.. ఏకంగా 12 మందిని వివాహాం చేసుకున్నాడు. ఈ మోసగాడి గుట్టును 12వ భార్య పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఒక పిల్ల దొరికి..పెళ్లి కావడమే కష్టం అయిపోయిన ఈ రోజుల్లో ఈ కుర్రాడు ఏకం గా పన్నెండు మందిని పెళ్లి చేసుకున్నాడు.
చెన్నైకి చెందిన గణేశ్ అనే యువకుడుకి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం అయింది. క్రమంగా ఆపరిచయాన్ని పెంచుకుని ఆఅమ్మాయిని పెళ్లికి ఒప్పించాడు. పెద్దలకు చెప్పకుండా ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదు. వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా.. ఫలితం లేకుండా పోయింది. వారిద్దరూ మేజర్లు కావడంతో.. కాపురం కూడా పెట్టారు. కొద్ది రోజులు బాగానే ఉన్నారు.
కొద్ది రోజుల తరువాత గణేశ్ ప్రవర్తనపై అతడి భార్యకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా.. తనకంటే ముందే 11 మందితో అతడికి పెళ్లి అయిందని తెలిసి ఆ యువతి షాక్‌నకు గురైంది. లిస్ట్‌లో తాను 12వ దాన్ని అని తెలుసుకుంది. ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి గణేశ్ ను అరెస్ట్ చేశారు.