దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
Young man killed woman in chittor district.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దారుణాలు
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2021 4:04 PM ISTదేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దారుణాలు ఆగడం లేదు. తనను ప్రేమించాలని ఓ ప్రేమోన్మాది ఓ యువతి వెంట పడ్డాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. అయినప్పటి అతడు ఆయువతిని వేదిస్తూనే ఉన్నాడు. రోజురోజుకు వేదింపులు ఎక్కువ కావడంతో ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన అతడు.. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వచ్చి యువతిని దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం ఇంటి బయటకు వచ్చి అతడు కూడా గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా గ్రామీణ మండలం సాంబయ్య కండ్రిగకు చెందిన యువతి సుష్మిత నగర శివార్లలోని సీఎంసీ ఆస్పత్రిలో ఏన్ఎంగా పని చేస్తోంది. గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్న అదే గ్రామానికి చెందిన చిన్నాఅనే యువకుడు గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో ఆమెను వేదిస్తున్నాడు. రోజు రోజుకు వేదింపులు తీవ్రం అవుతుండడంతో సుష్మిత.. చిన్నాపై గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో కోపోద్రిక్తుడైన చిన్నా శుక్రవారం యువతి ఇంటికి వెళ్లి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన సుష్మిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం చిన్నా బయటకు వచ్చి గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. దాడి చేసిన సమాచారం తెలుసుకున్నగ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇంటిముందు పడిపోయిన చిన్నాపై రాళ్ల దాడి చేశారు. అప్పటికే గొంతు కోసుకున్నచిన్నా..గ్రామస్తుల రాళ్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.