అప్పుల బాధలతో యువకుడి బలవన్మరణం
Young Man Commits suicide in Hyderabad.జీవితంలో ఏదో ఓ సందర్భంలో అప్పు చేయక తప్పదు. అయితే.. కొందరు సకాలంలో
By తోట వంశీ కుమార్ Published on 2 March 2022 12:44 PM ISTజీవితంలో ఏదో ఓ సందర్భంలో అప్పు చేయక తప్పదు. అయితే.. కొందరు సకాలంలో చెల్లించినప్పటికీ మరికొందరు పరిస్థితులు అనుకూలించక తీర్చే మార్గం కనిపించక బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఫైనాన్సర్ల వేదింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కుటుంబ అవసరాల నిమిత్తం సాయి కృష్ణ(26) అనే ఓ యువకుడు కొంత మొత్తాన్ని ఫైనాన్సర్ల దగ్గర అప్పు తీసుకున్నాడు. కరోనా సమయంలో ఆ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్లు సాయికృష్ణ పనిచేస్తున్న షాపు వద్దకు వెళ్లి అతని హెండా యాక్టివాను తీసుకెళ్లిపోయారు. సాయి కృష్ణ తల్లిదండ్రులు వారిని ప్రాదేయపడినా వినలేదు. ఇప్పుడే కట్టాలి అంటూ ఒత్తిడి చేశారు. ఎవరినైనా అడిగి డబ్బులు కడదామని చెప్పి సాయికృష్ణ తల్లి బయటకు వెళ్లింది. తమకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇంట్లో ఎవరి లేని సమయంలో సాయి కృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. యాప్‌ల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అంటూ ఆశచూపీ.. ఆ తరువాత వేదిస్తున్నారు. అప్పు చెల్లించకుంటే.. వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న బంధువులు, స్నేహితులకు మెసేజ్‌లు పంపుతుండడంతో కొందరు వీటిని భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.