పేదరికంలో మగ్గిపోతున్న ఓ యువకుడికి జీవితంపై విరక్తి కలిగింది. ఉరివేసుకుని సెల్ఫీ తీసుకుని దానిని స్నేహితులకు వాట్సాప్‌లో పంపాడు. అనంతరం ఆ విషయాన్ని వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆత్మకూరు(ఎం)లో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు .. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన రమేష్(24) స్థానికంగా ఫాస్ట్‌పుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు.
వచ్చే జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారిందని ఆవేదన చెందుతుండేవాడు. శుక్రవారం స్నేహితులకు ఫోన్ చేసి ఇన్ని రోజులుగా పేదరికంతోనే జీవించానని రోదించాడు. ఇక తనకు విరక్తి కలిగిందని చనిపోవాలని అనుకుంటున్నట్లు వారికి చెప్పాడు. స్నేహితులు అతడిని వారించేందుకు ప్రయత్నించినా.. వారి మాట వినలేదు. వెంటనే వారు స్నేహితుడి కోసం ఉరంతా వెతకసాగారు. ఆత్మకూరు వీర్ల చెరువు సమీపంలో రమేష్ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే రమేష్ కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి తల్లి ఆండాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యప్తు చేపట్టారు.