అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే కారణంతో ఓ యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలపై కేసు నమోదైంది.
బాధితుడి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి డీజిల్ కాలనీలో అద్దెకు ఉండేవారు. ఇంటి యజమాని కుమారైతో ప్రసాద్ మాట్లాడుతున్నాడనే కారణంతో గొడవలు జరుగగా.. ప్రసాద్ కుటుంబం వేరే ఇంటికి మారారు. అయితే.. బుధవారం ప్రసాద్‌కు అమ్మాయితో బంధువులు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. అక్కడకు వెళ్లిన ప్రసాద్ కాళ్లు చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రసాద్ మిత్రులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రసాద్ తల్లిదండ్రులు, మిత్రులు వెళ్లి.. అతడిని విడిచి పెట్టాలని కోరగా.. ఇంకోసారి అమ్మాయి జోలికి రావొద్దంటూ రాయించుకుని వదిలివేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. అమ్మాయిని వేదించారని యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. యువకుడిని చితకబాదిన కేసులో మాచర్ల శేఖర్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.