ప్రేమోన్మాది ఘాతుకం.. డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య
Young man attacked Degree student in kadapa district.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దాడులు
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2021 8:38 AM IST
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దాడులు ఆగడం లేవు. తన ప్రేమను నిరాకరించిందంటూ ఓ యువకుడు కత్తితో విద్యార్థిని గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లా బద్వేలు మండలం చింతల చెరువు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చింతచెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమారై శిరీష(18) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అల్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన నారాయణ, పద్మల కుమారుడు చరణ్ హైదరాబాద్‌లోని ఓప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.
గత కొంతకాలంగా చరణ్.. శిరీషను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయితే.. అతడిని ప్రేమించేందుకు శిరీష నిరాకరిస్తోంది. ప్రస్తుతం కాలేజీకి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది శిరీష. ఈ క్రమంలో శుక్రవారం చింతల చెరువు గ్రామంలోని శిరీష ఇంటికి వెళ్లాడు. మాట్లాడే క్రమంలో ఆవేశానికిలోనైన చరణ్.. తన వెంటతెచ్చుకున్న కత్తితో విద్యార్థిని శిరీష గొంతు కోశాడు. దీంతో ఆ యువతి అక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బద్వేలు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శిరీష మృతి చెందినట్లు నిర్థారించారు.
ఈ దారుణ ఘటనను గమనించిన గ్రామస్తులు చరణ్ పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ ప్రేమోన్మాదిని బద్వేల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే.. శిరీషను పొడిచిన తరువాత చరణ్ పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.