దారుణం : బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి కొడుకు, కూతురిని చంపిన త‌ల్లి

ప్రియుడి సాయంతో క‌న్న కొడుకు, కూతురిని ఓ త‌ల్లి హ‌త్య చేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మీర‌ట్‌లో జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2023 9:34 AM IST
Mother kills daughter and son, UP

జ‌రిగిన ఘ‌ట‌న‌ను వివ‌రిస్తున్న ఎస్పీ పీయూష్ సింగ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మీర‌ట్‌లో ఓ దారుణ‌ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఓ మ‌హిళ త‌న ప్రియుడి సాయంతో త‌న 10 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కూతురిని హ‌త్య చేసింది. అనంత‌రం మృత‌దేహాల‌ను కాల్వ‌లో ప‌డేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ కేసులో మహిళ ఇరుగుపొరుగు వారి ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు. జంట హత్యలతో సంబంధం ఉన్న ఆరుగురిని ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు చేశారు. కాగా.. చిన్నారుల మృత‌దేహాలు ఇంకా ల‌భ్యం కాలేదు. వాటి కోసం గాలిస్తున్నారు.

"మార్చి 22న అన్నాచెళ్ల‌లు అయిన 10 ఏళ్ల బాలుడు ,ఆరేళ్ల బాలికను వారి త‌ల్లి ఆమె ప్రియుడు స్థానిక కౌన్సిలర్ అయిన సౌద్‌తో క‌లిసి హ‌త్య చేసింది. అనంత‌రం ఆ చిన్నారులు ఇద్ద‌రి మృత‌దేహాల‌ను కాలువ‌లో విసిరేసింది. ఇందుకు ఇరుగుపొరుగువారు సాయం చేశారు. పిల్ల‌లు త‌ప్పిపోయిన‌ట్లు కేసు న‌మోదు కాగా.. ద‌ర్యాప్తులో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చిందని " సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నగరం) పీయూష్ సింగ్ తెలిపారు.

"ఈ జంట హ‌త్య‌ల‌లో ముగ్గురు మ‌హిళ‌లు, ముగ్గురు పురుషుల హ‌స్తం ఉంద‌న్నారు. బాలిక‌ను ఆమె ఇంట్లోనే చంపేయ‌గా, అబ్బాయిని పొరుగువారి ఇంట్లో హ‌త‌మార్చారు. నిందితులు అంద‌రిని అరెస్ట్ చేశాం. మృత‌దేహాలు ఇంకా ల‌భ్యం కాలేదు. వాటి కోసం గాలిస్తున్నాం. కేసు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతోంది." అని ఎస్పీ చెప్పారు.

Next Story