పెంపుడు కుక్క గురించి ఇంట్లో గొడవ.. తల్లీకూతుళ్లు ఆత్మహత్య
Woman her daughter commit suicide in bengaluru over pet dog issue. కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన జరిగింది. పెంపుడు కుక్కలను ఇతరులకు ఇవ్వడానికి కుటుంబ
By అంజి
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన జరిగింది. పెంపుడు కుక్కలను ఇతరులకు ఇవ్వడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని ఓ మహిళ, ఆమె కుమార్తె తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి దివ్య (36) గృహిణి, ఆమె కుమార్తె హ్రుద్య(13) ఒక ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. దివ్యకు కుక్కలంటే ఎలర్జీ. ఆమె కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె వైద్యులను సంప్రదించింది. అయితే దివ్య అనారోగ్యానికి కారణంగా కుక్కలేనని, వాటికి దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు.
పెంపుడు కుక్కను వేరే వాళ్లకు ఇవ్వాలని ఆ మహిళ తన భర్తను, అత్తమామలను కోరగా వారు కుక్కను ఇవ్వడానికి నిరాకరించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమె అత్తింటి వాళ్లు వేరే వాళ్లకు కుక్కను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో బాధపడిన ఆమె.. ఆరో తరగతి చదువుతున్న కుమార్తె హృద్య (13)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్త, ఆమె అత్తగారిపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త, అత్తవారింటిపై దివ్య తండ్రి రామన్ ఎంకే ఫిర్యాదు చేశారు. దివ్య, శ్రీనివాస్‌లు 2008లో వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పెంపుడు కుక్కను ఇంట్లో ఉంచితే తాను, తన బిడ్డ ఆత్మహత్య చేసుకుంటామని తన కూతురు చెప్పిందని, ఆమె చనిపోతే ఏమీ జరగదని, తమ పెంపుడు జంతువును కాపాడుకుంటామని భర్త, అత్తామామలు దురుసుగా స్పందించారని దివ్య తండ్రి రామన్ తన ఫిర్యాదులో తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటల వరకు దివ్య, ఆమె కుమార్తె తమ గది నుంచి బయటకు రాలేదని పోలీసులు తెలిపారు. ఆమె భర్త.. వారు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని చెప్పాడు. తమకు ఎటువంటి డెత్ నోట్ దొరకలేదు, రామన్ ఫిర్యాదు ఆధారంగా అనుమానితులపై కేసు నమోదు చేశామని ఒక అధికారి తెలిపారు.